ఐటీ వెంట ఈడీ ఎంటర్?

తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు, రాజకీయ శక్తి సామర్ధ్యాల గురించి. ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదు. ఆయన తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేయగలరు. అయితే, అది అన్ని వేళల సాధ్యమవుతుందా,అంటే అవునని అనలేము. కాదని చెప్పలేము. నిజానికి, రాజకీయాలలోనే కాదు, ఏ రంగంలో అయినా, వారివారి రంగాల్లో వారు ఎంత ఉద్దండులే అయినా, ఎల్లకాలం ఒకేలా ఉండదు.ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవడం అనుభవంలో ఉన్న విషయమే.  అయినా రేపటి సంగతి ఎలా ఉన్నా ఈరోజుకు, తెలంగాణ వరకు కేసీఆర్ తిరుగులేని నాయకుడు. అందులో సందేహం లేదు. 

కానీ, జరుగతున్న పరిణామాలను గమనిస్తే, ఆయన గ్రహస్థితి మారుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. నిజానికి, రాజకీయంగానే కాదు,జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినా, అక్టోబర్ నెలలో దీపావళి పండగ వెళ్ళిన మర్నాడు సంభవించిన పాక్షిక సూర్య గ్రహణం, కేసేఆర్ జన్మ రాశి పై ప్రతికూల ప్రభావం చూపుతుందని, జ్యోతిష శాస్త్ర పండితులు సూచించారు.

సరే అదలా వుంచి, విషయంలోకి వస్తే, మంత్రి మల్లారెడ్డి, ‘రాగ్స్ టు రిచ్స్’ స్టొరీ అందరికీ తెలిసిందే అయినా, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి, ఐటీ అధికారులు రెండు రోజులు ఆయనకు సంబందించిన ఇళ్లు, వాకిళ్లు, కాలేజీలు, కార్యాలయాలు, బంధు మిత్రుల ఇళ్లు, కార్యాలయాలు ఇలా మొత్తం ఓ 50, 60 చోట్ల నిర్వహించిన సోదాల్లో ఏమి దొరికాయో, ఏమి దొరకలేదో స్పష్టంగా తెలియదు కానీ, ఈ దాడులు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. ఈ విషయంలో ఎవరికీ వారు గుంభనంగా వ్యవహరిస్తున్నా, ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే భయం మాత్రం అందరిలో ఉన్నట్లే కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.  

నిజానికి, స్వయంగా మంత్రి మల్లారెడ్డి చెప్పినట్లుగా, విద్యా వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు జరగడం, అందులో లెక్కలకు ఎక్కని నోట్ల కట్టలు దొరకడం మాములు విషయమే. మల్లారెడ్డి అస్తులపై ఐటీ దాడులు జరగడం కూడా ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే రెండుసార్లు దాడులు జరిగాయి. ఆయనే సరదాగా చెప్పినట్లు ఇది  ‘హట్రిక్’ దాడి. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస మధ్య గత కొంత కాలంగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో భాగంగా  ఐటీ సోదాలు జరగడంతో,ఈ దాడులు రాజకీయ ప్రాధాన్యతను సంతరిం చుకున్నాయి. అంతే కాదు,పైకి మంత్రి మల్లారెడ్డి టార్గెట్’ గా దాడి జరిగినట్లు కనిపిస్తున్నా,ఈమొత్తం వ్యవహారంలో ఎంతకీ తెగని రాజకీయ చిక్కుముళ్ళు కూడా ఉన్నాయని అంటున్నారు.అసలు మూలాలు మరెక్కడో ఉన్నాయని అంటున్నారు. 

గత మూడు నాలుగు నెలలుగా రాష్ట్రంలో జరుగతున్న పరిణామాలను గమనిస్తే, ముఖ్యమంత్రి కేసేఆర్ మీద జాతక చక్రం ప్రభావం బలీయంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఒక్క ఐడియా జీవితాన్నే మార్చి వేస్తుంది అన్నట్లుగా, ఢిల్లీ లిక్కర్ స్కాం’లో తెరాస ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుట్ల కవిత పేరు ప్రముఖంగా వినిపించింది మొదలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, బీజేపీ, తెరాసల మధ్య యుద్ధం, ప్రధానంగా కవిత కేంద్రగానే జరుగుతోంది.కవిత కోసమే కేసీఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. కొత్త ఎత్తులు వేస్తున్నారని, అందులో భాగంగానే, మంత్రి మల్లారెడ్డి  రెడ్డి బకరా అయ్యారని అంటున్నారు. 

నిజానికి మల్లారెడ్డి ఎపిసోడ్’లో ఇంతవరకు జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు కథ ముందుందని తెరాస నాయకులే అనుమానిస్తున్నారు.పొట్టోడిని పోడుగోడు కొడితే, పొడుగోడిని పోచమ్మ తన్నింది అన్నట్లు, లిక్కర్ కుభాకోణం నుంచి కవితను సేవ్ చేసేందుకు, బీజేపీని ఇరకాటంలోకి నెట్టే ఉద్దేశంతో ఎమ్మెల్యేల ఎర ఎపిసోడ్ ను తెరమీదకు తెచ్చారు. అయితే, న్యూటన్ థర్డ్ లా, ప్రకారం ‘ ప్రతి చర్యకూ అందుకు  సమానమైన వ్యతిరేక ప్రతిచర్య ఉంటుంది’, అనే సూత్రాన్ని పాటిస్తూ బీజేపీ మంత్రి మల్లారెడ్డి మీదకు ఐటీని వదిలింది.

ఐటీ వరకు అయితే ఓకే, కానీ, ఐటీ వెంట ఈడీ ఎంటర్ అవుతోందని అంటున్నారు. ఐటీ సోదాల్లో వెలుగు చూసినట్లు చెపుతున్న, మల్లారెడ్డి ‘మాయాజాలం’ వివరాలను ఐటీ అధికారులు ఈడీకి అందించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే, మంత్రి మల్లారెడ్డి మరింతగా చిక్కుల్లో ఇరుక్కోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా ఐటీ సోదాల్లో పెద్ద మొత్తంలో హవాలా లావాదేవీలకు సంబందించిన వివరాలు దొరికిందే నిజం అయితే, ఈడీ ఎంటర్ అవుతుందని, ఆ తర్వాత ఏమి జరుగుతుందో, అందరికీ తెలిసిందే అంటున్నారు. 

అదలా ఉంటే మంత్రి మల్లారెడ్డి, అయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలలో దొరికినట్లు చెపుతున్న హవాలా లావాదేవీల ఆధారంగా, మంత్రి మల్లారెడ్డి సహా  సంబంధిత కంపెనీలకు చెందిన 16 మంది డైరెక్టర్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28, 29వ తేదీల్లో తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఆర్థిక లావాదేవీలకు చెందిన డాక్యుమెంట్స్‌‌ను తీసుకురావాలని స్పష్టం చేసింది. మరోవైపు స్వాధీనం చేసుకున్న హవాలా ట్రాన్సాక్షన్స్ ఆధారాలను ఈడీకి అందించేందుకు ఐటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అదలా ఉంటే తెరాస నాయకులు కొందరు, కేసీఆర్ తమ కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు మల్లారెడ్డి వంటి వారు బలిపశువులు కావలసి వస్తోందనే ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. అయితే, మల్లారెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్’పై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అయన నా ‘దేవుడు’ అంటున్నారు.  మరి ముఖ్యమంత్రి తమ శక్తి సామర్ధ్యాలను ఉపయోగించి మల్లారెడ్డిని సేవ్ చేస్తారా, లేక కొందరు నేతలు అనుమానిస్తున్నట్లుగా, ఫ్యామిలీ ఫస్ట్ అంటాటా, అనేది తేలవలసి ఉందని అంటున్నారు.