రాజ్యాంగ పదవుల్లో రాజకీయ నియామకాలు

రాజ్యాంగ  పదవులలో అధికార నియామకాల విషయంలో, వివాదాలు తలెత్తడం కొత్త విషయం కాదు. సీబీఐ, ఈడీ,సీవీసీ డైరెక్టర్లు, సీఈసీ కమిషనర్ల నియామకాల నుంచి, విశ్వ విద్యాలయాల వైస్ వైస్ చాన్సలర్ల నియామకాల వరకు, అనేక సందర్భాలలో రాజ్యాంగ పదవుల్లో రాజకీయ నియామకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు రావడం, ఆ నియామకాలు  వివాదంగా మారడం చాలా కాలంగా ఉన్నదే. ఇప్పడు, మళ్ళీ మరోమారు అలాంటి వివాదమే తెరపైకొచ్చింది.

 కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు కమిషనర్లలో ఒక కమిషనర్ పోస్ట్ చాలాకాలం ఖాళీగా ఉంది, ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం, కేంద్ర న్యాయశాఖ సిఫార్సు చేసిన నలుగురిలోంచి, మాజీ ఐఎఎస్ అధికారి అరుణ్ గోయల్ ను ఎన్నికల సంఘం కమిషనర్‌గా నియమించింది. ఆయన ఆ వెంటనే బాధ్యతలు స్వీకరించారు. అయితే, ఈ నియామక ప్రక్రియను సుప్రీం కోర్టు తప్పు పట్టింది. 

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకం కోసం న్యాయశాఖ, అనేక పేర్లను పరిశీలించి నలుగురి పేర్లను షార్ట్‌లిస్ట్‌ చేసింది. నవంబరు 18న ఆ ఫైల్‌ను ప్రధాని కార్యాలయానికి పంపించింది. ప్రధాని అదే రోజున ఒక పేరును ప్రతిపాదించారు... ఇలా ఒకే రోజులో ప్రధాని కార్యాలయం నిర్ణయం తీసుకోవడంతో గోయెల్ నియామకం నిబంధనల ప్రకారమే జరిగిందా అని అనుమానం సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియను ఎందుకంత వేగంగా పూర్తి చేయవలసి వచ్చిందని, ధర్మాసనం ప్రశ్నించింది. 

అరుణ్ గోయల్ ఇటీవలే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం, ఆ వెంటనే ఎన్నికల కమిషనర్‌గా నియామకం పొందడం వెనుక అనుమానాలు వ్యక్తం చేసింది. కేంద్ర న్యాయశాఖ నలుగురి పేర్లను సిఫార్సు చేస్తే, వారిలో అందరికంటే వయస్సులో చిన్నవారైన అరుణ్‌ గోయల్‌ పేరును ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు. ఫైల్ సర్క్యులేట్ కాకుండానే, ఒకే రోజులో ప్రధాని కార్యాలయం ఎలా నిర్ణయం తీసుకుంది. ఒకే రోజులో అప్పాయింట్మెంట్ ఎలా జరిగింది. ఎందుకంత హడావుడిగా, వేగంగా ఆమోదించాల్సి వచ్చింది? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.

ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గత 5 రోజులుగా విచారిస్తోంది. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సీటీ రవికుమార్‌‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారిస్తోంది. ఇదే సమయంలో ఈసీ నియామకం జరగడంతో సుప్రీం కోర్టు, బుధవారం ఆకేసు విచారణ సందర్భంగా అనుమానాలు వ్యక్త పరుస్తూ, ప్రశ్నలు సంధించింది. అరుణ్‌ గోయల్‌ నియామక ప్రక్రియకు సంబంధించిన ఫైళ్లను కోర్టుకు సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు అరుణ్ గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి గురువారం (నవంబర్ 24) కోర్టుకు సమర్పించారు.

 సదరు ఫైళ్లను పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రం తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేసింది. 24 గంటలు కూడా గడవక ముందే మొత్తం నియామక ప్రక్రియను ఎలా పూర్తి చేశారని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇదేం నియామకం?ఎందుకీ తొందర?అంటూ ధర్మాసనం నియామక ప్రక్రియ విషయంలో అసంతృప్తిని వ్యక్తపరిచింది.అయితే అదే సమయంలో సుప్రీం ధర్మాసనం, ఇక్కడ మేం అరుణ్‌ గోయల్‌ సామర్థ్యాలను శంకించట్లేదు.నియామక ప్రక్రియ గురించి మాట్లాడుతున్నాం అని స్పష్టం చేసింది. మే15వ తేదీ నుంచి కేంద్ర ఎన్నికల కమిషనర్‌ పోస్టు ఖాళీగా ఉందని, నాటి నుంచి నవంబరు 18వ తేదీ వరకు ఏం జరిగిందో చెప్పాలని ఏజీని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.

అటార్నీ జనరల్‌ వెంకటరమణి వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కమిషనర్‌ ఎంపిక ప్రక్రియలో ఎలాంటి పొరపాటు జరగలేదన్నారు. గతంలోనూ 12 నుంచి 24 గంటల్లో నియామకాలు జరిగిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. న్యాయశాఖ ప్రతిపాదించిన నాలుగు పేర్లను డీఓపీటీ డేటాబేస్‌ నుంచే తీసుకున్నారు.ఆ వివరాలన్నీ బహిరంగంగానే అందుబాటులో ఉన్నాయి. ఇక, పేరు ఎంపిక సమయంలో వ్యక్తి సీనియార్టీ, పదవీ విరమణ వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వయసుకు బదులుగా బ్యాచ్‌ ఆధారంగా సీనియార్టీని పరిగణిస్తారు అని  వివరణ ఇచ్చారు.

ఈ అంశంపై విచారణ చేపట్టడం, అనుమానాల నివృత్తి కోసం వేసే ప్రశ్నల ద్వారా.. కేంద్రానికి తాము వ్యతిరేకమని అర్థం చేసుకోకూడదని సుప్రీం ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంలో లిఖితపూర్వక వాదనలు దాఖలు చేసేందుకు ఇరుపక్షాలకు 5 రోజుల సమయం ఇచ్చింది. వాద, ప్రతివాదనలు విన్న తర్వాత సీఈసీ, ఈసీలను పారదర్శకంగా నియమించడానికి స్వతంత్ర ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలా? వద్దా? అనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. 

అయితే, ఈ వివాదం ఇంతటితో ముగిసి పోతుందని అనుకోలేమని, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట జరిగిన ఈ నియామకం విషయంలో రాజకీయ దుమారం చెలరేగినా ఆశ్చర్య పోనవసరం లేదని, రాజీకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే, రాజ్యాంగ పదవుల నియామకాల్లో తలెత్తే సమస్యలు, వివాదాలకు శాశ్వత పరిష్కారం కనుగొన వలసిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ప్రస్తుతం విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లకు మధ్య వివాదాలు రగులుతున్న నేపధ్యంలో, రాజ్యాంగ పదవుల నియామకాల విషయంలో జాతీయ స్థాయిలో సమగ్ర చర్చ అవసరం అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.