మేము పూజలు చేసుకుంటే మీకేం బాధ

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన నరేంద్ర మోదీ.. కేసీఆర్ పూజల గురించి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన కేసీఆర్.. ‘మేము పూజలు చేసుకుంటే మీకెందుకు బాధ’ అంటూ ఘాటైన సమాధానం ఇచ్చారు. తనకు దేవుడంటే నమ్మకమని అందుకే పూజలు, హోమాలు చేసుకుంటున్నానని అన్నారు. తాను నిజామాబాద్‌కు తాగునీరు, సాగునీరు అందించలేదని ప్రధానమంత్రి అబద్ధాలు చెబుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

నిజామాబాద్‌లో తాగునీరు, విద్యుత్‌ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా? అని ప్రశ్నించారు. దమ్ముంటే మోదీ రావాలి.. నిజామాబాద్‌లో తేల్చుకుందాం అని సవాల్‌ విసిరారు. మోదీ రమ్మంటే తాను మహబూబ్‌నగర్‌ నుంచి హెలికాఫ్టర్‌లో నిజామాబాద్‌కు వస్తానని, ఎక్కడ సమస్య ఉందో ప్రజలముందే తేల్చుకుందామన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, ఎవరికీ భయపడబోనన్నారు. మోదీకి ఎవరు స్క్రిప్ట్‌ రాసిచ్చారో గాని ఆయనంత తెలివితక్కువ ప్రధానిని చూడలేదని వ్యాఖ్యానించారు.

15 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణను సాధించిన చరిత్ర టీఆర్ఎస్‌ది అని పేర్కొన్నారు. ‘కేసీఆర్‌ను అడ్డుకునేందుకు ఇంతమంది ఏకం కావాలా?’ అని వ్యాఖ్యానించారు. వీటిన్నంటినీ గమనించి ఎవరు ఎటువైపు ఉంటారో ప్రజలే ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎందుకు ఇవ్వలేదని  ప్రశ్నించారు.  18 రాష్ట్రాలలో బీజేపీ అధికారం ఉందని కానీ ఏ ఒక్క రాష్ట్రంలోనైనా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారా అని కేసీఆర్ ప్రశ్నించారు. 

దేశంలో 70వేల టీఎంసీల నీరు ఉందని, పాలకుల నిర్లక్ష్యం వల్ల నీరంతా వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పోయి ఫెడరల్‌ ఫ్రంట్‌ రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ వాళ్లు వచ్చి బీజేపీతో టీఆర్ఎస్ కుమ్మక్కైందంటున్నారు. మోదీ వచ్చి కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలిసిందంటున్నారు. వారి విమర్శలన్నీ పచ్చి అబద్ధం.. మాకెవరితో పొత్తులేదు. అన్నిస్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నాం’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.