జగన్ సర్కార్ పై ఉద్యోగుల ఆగ్రహానికి నిదర్శనం.. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సునామీ!

వైపీపీ ఓటమి తథ్యమన్న బలమైన సంకేతాన్ని ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్  ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 90శాతం మందికి పైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. గతంలో ఎన్నడూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 77 శాతం మించిన దాఖలాలు లేవు. అంతెందుకు పొరుగు రాష్ట్రం తెలంగాణలో గతం కంటే తక్కువ మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఉద్యోగులు ఉప్పెనలా కదలి వచ్చి మరీ తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు. 
ఈ క్రమంలో వారెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారు తమ ఓటు ఎక్కడ వేయాలన్న విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఇక్కడ కాదు అక్కడ అంటూ తిప్పారు. కొందరు అధికారులు వారి పని ప్రదేశంలోనే వారి ఓటు ఉంటుందని చెబితే మరి కొందరేమో వారు నివసించే ప్రాంతంలోనే వారి ఓటు ఉంటుందని చెప్పారు. ఈ గందరగోళం కారణంగా కొందరు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోలేకపోయారు. మరి కొందరి ఓట్లు గల్లంతయ్యాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ల లో సౌకర్యాలు లేవు. ఇన్ని కష్టాల మధ్య కూడా 90శాతం మందికి పైగా ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

2019 ఎన్నికలలో 77 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైతే.. వాటిలో వైసీపీకి 1.34 లక్షలు, తెలుగుదేశంకు 80 వేలు, జనసేనకు 11 వేలు, బీజేపీకి నాలుగువేల ఓట్లు వచ్చాయి.  అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి అత్యధికంగా 90శాతానికి పైగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇంత అధికంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలు కావడమే వైసీపీని ఖంగారు పెడుతోంది. ఆందోళనకు గురి చేస్తోంది. జగన్ సర్కార్ ఉద్యోగులను నానా విధాలుగా వేధించింది. వారి పీఎఫ్ డబ్బులను మళ్లించడం దగ్గర నుంచి అన్ని విధాలుగా వారిని వేధింపులకు గురి చేసింది. చులకనగా చూసింది. మద్యం దుకాణాల దగ్గర కాపలాగా పెట్టింది. అసలు మీరేం పని చేస్తున్నారని సమయానికి వేతనాలు, అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారంటూ ప్రశ్నించింది. చివరాఖరికి వారి అటెండెన్స్ విషయంలో కూడా ఫేస్ రికగ్నేషన్ అంటూ ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగులు అనేక కష్టనష్టాలకు ఓర్చి కూడా ఎలాగైనా ఓటు వేసి తీరాలన్న సంకల్పంతో పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకోవడం వైసీపీ పట్ల వారికి ఉన్న ఆగ్రహాన్ని, ఎలాగైనా ఆ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న పట్టుదలనూ సూచిస్తోంది. వైసీపీలో అందుకే ఆందోళన వ్యక్తం అవుతోంది. 

తాము సృష్టించిన సచివాలయ ఉద్యోగులు వైసీపీకే ఓట్లు వేస్తారని జగన్ సర్కార్ ఆశలు పెట్టుకంది. అయితే సచివాలయ ఉద్యోగులలో కూడా జగన్ సర్కార్ పై తీవ్ర వ్యతిరేకత, అసంతృప్తి కనిపిస్తోంది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగమే అయినా పని ఎక్కువ వేతనం తక్కువ ఉండటంతో వారు కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  

మొత్తం మీద జగన్ పాలనలో తాము ఎదుర్కొన్న కష్టాలు, అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న అవమానాలు.. ఇలా అన్నిటికీ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుని బదులు తీర్చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగులు, టీచర్ల ఆగ్రహమే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సునామీగా మారిందని అంటున్నారు. గత ఎన్నికల ముందు అప్పటికి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలను అధికారంలోకి వచ్చిన తరువాత తుంగలో తొక్కారనీ, హామీలు నెరవేర్చడం, వాగ్దానాలు అమలు చేయడం సంగతి అటుంచి కనీసం ఒకటో తారికు నాటికి వేతనాలు వస్తే చాలు భగవంతుడా అని వేడుకునే స్ధితికి ఉద్యోగులను తీసుకువచ్చిన జగన్ ప్రభుత్వంపై వారి ఆగ్రహం ఓటుగా మారిందని అంటున్నారు. 

  ఉద్యోగుల ఆగ్రహాన్ని గమనించిన  వైసీపీ నాయకులు  ఏకంగా ఉద్యోగస్తులు పాదాల మీద ఓటు వేయమంటూ బతిమలాడుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.   దీనిని బట్టే ఉద్యోగుల ఆగ్రహజ్వాలల సెగ వైసీపీకి ఎంత గట్టిగా తగిలిందో అర్ధమౌతోందంటున్నారు పరిశీలకులు.