వైఎస్‌ పొలాలు దోపిడీ.. చంద్రబాబు కాల్పులు

 

కోనసీమ నీళ్లు ఒకప్పుడు కొబ్బరినీళ్లలా ఉండేవి, ఇప్పుడు కలుషితమై ఉప్పునీరులా మారిపోయాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్‌లో రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన వివిధ అంశాలపై అటు చమురు సంస్థలు, ఇటు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. చమురు సంస్థల అన్వేషణ వల్ల కోనసీమలో పర్యావరణం దెబ్బతింటోందని పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అంబానీలను రాష్ట్రానికి పిలిచి కోనసీమకు అండగా ఉండాలని కోరతానని అన్నారు. మిగతా పార్టీల్లా పార్టీఫండ్‌ ఇస్తే లొంగిపోయే పార్టీ జనసేన కాదని, ఇక్కడ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రకృతి వనరులను దోచుకుపోతూ ఉంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.

రైతులకు జనసేన అండగా ఉంటుందన్నారు. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని ఆవేదన చెందారు. రైతుల కన్నీళ్లు చూడలేకే రాజకీయాల్లోకి వచ్చాను, వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఎస్‌ఈజెడ్‌ల పేరుతో పొలాలు దోచుకుని రైతులను రోడ్డున పడేశారు. చంద్రబాబు హయాంలో బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరపడం కలచివేసింది. ఊళ్ల కోసం రోడ్లు వేయడం చూశామని, రోడ్ల కోసం ఊళ్లను తీసేయడం రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. అవినీతి, దోపిడీని అరికట్టాలని పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. రైతుల కష్టాలను తీర్చడం లో జనసేన అగ్రతాంబూలం ఇస్తుందన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడటానికి ఇక్కడకు రాలేదని, వినడానికి వచ్చానని ఆయన పేర్కొన్నారు.