ఓడిపోతే పారిపోతావ్.. కొడంగల్ దత్తత తీసుకుంటావా?

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి తెరాస ప్రభుత్వం, కేసీఆర్,కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. కొడంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ప్రజలతో చర్చించాకే గతంలో ప్రభుత్వాలను రద్దు చేసేవారని తెలిపారు.  ప్రభుత్వ రద్దు గురించి ప్రజలకు వివరించాల్సిన నైతిక బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందని, కానీ కేసీఆర్‌కు రాజ్యాంగం అంటే చులకన భావం ఉందని ఆరోపించారు.  కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. కుటుంబసభ్యుల ఆస్తులు పెంచుకోవడం కోసం కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. 52 నెలల పాలనలో ఉద్యమకారుల ఆకాంక్షలపై కేసీఆర్‌ ఏనాడూ ఆలోచన చేయలేదని రేవంత్‌ తెలిపారు. ప్రస్తుతం తెరాస కూటమి, ప్రజాకూటమి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

కొడంగల్‌ ప్రాంతాన్ని ఎండబెట్టింది కేసీఆరేనని మండిపడ్డారు. రైల్వేలైన్‌ దస్త్రాన్ని తొక్కిపెట్టి ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. కొడంగల్‌ కనీస అభివృద్ధికి కూడా సహకరించలేదని ధ్వజమెత్తారు. ఓడిపోతే పారిపోయే కేటీఆర్‌.. కొడంగల్‌ను దత్తత తీసుకొని ఏం చేస్తారని ప్రశ్నించారు. కొడంగల్‌లో తాను ఉన్నత వరకూ ఇటు వైపు ఎవరూ చూసే సాహసం కూడా చేయరని స్పష్టం చేశారు. రేపు కోస్గిలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రచారానికి వస్తున్నారని, ఆయన రావడం అభివృద్ధికి సూచిక అని రేవంత్‌ అన్నారు. రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయాలని కోరారు. మన కాంగ్రెస్‌ వస్తే మన ప్రభుత్వం వస్తుందని,ఆ‌ ప్రభుత్వంలోనే ఆత్మగౌరవం, సామాజికన్యాయం ఉంటాయని రేవంత్‌ అన్నారు.