ఆ ఒక్కడే ఇద్దరు ముఖ్యమంత్రుల టార్గెట్? ఆ వర్గ నాయకులంతా అటు వైపేనా ?
posted on Dec 21, 2020 1:09PM
ఒక్క నాయకుడినే రెండు అధికార పార్టీలు టార్గెట్ చేస్తున్నాయా? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ , కేసీఆర్ ఏకమయ్యారా? తమ ఉమ్మడి శత్రువును అణగదొక్కేందుకు వ్యూహం రచిస్తున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తాజా రాజకీయాలను పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తోంది. తమకు మొదటి నుంచి ప్రత్యర్థిగా ఉన్న ఒక రాజకీయ నేత రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏకమయ్యారని తెలుస్తోంది. అతన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఉమ్మడి వ్యూహం పన్నుతున్నారని, అందుకోసం పక్కాగా స్కెచ్ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు టార్గెట్ చేశారని ప్రచారం జరుగుతున్న ఆ రాజకీయ నాయకుడు ఎవరో కాదు.. తెలంగాణ ఫ్రైర్ బ్రాండ్ లీడర్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. ఇటీవల ఏపీ మంత్రి పేర్ని నాని.. రేవంత్ రెడ్డిపై చేసిన కామెంట్లతో ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేస్తూ.. స్టేలు తెచ్చుకున్న విషయమై మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు పేర్ని నాని. ‘పొట్టిగా ఉంటాడు.. హడావుడిగా తిరుగుతుంటాడు.. అతడితో రూ.50 లక్షల సూట్ కేసు ఇచ్చి పంపించాడు’..అంటూ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డితో డబ్బులు ఇచ్చి పంపించారని అర్థం వచ్చేలా పేర్ని నాని కామెంట్ చేశారు. దీంతో రేవంత్ రెడ్డి టార్గెట్ గా కేసీఆర్, జగన్ కుట్రలు చేస్తున్నారని, అందులో భాగంగానే పేర్ని నాని కామెంట్లు చేశారని భావిస్తున్నారు.
గత ఆరేండ్లుగా కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుందని ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి చేస్తున్న పోరాటం వల్లే అతనికి క్రేజీ వచ్చిందని చెబుతారు. అటు మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేశారు రేవంత్ రెడ్డి. టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి.. అప్పటి వైఎస్సార్ సర్కార్ పై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడే వారు. తర్వాత జగన్ పైనా అదే వైఖరిని అవలంభించారు. దీంతో వైసీపీ నేతలు, కేడర్.. తమ రాష్ట్రం కాకపోయినా రేవంత్ రెడ్డిని తమ ప్రత్యర్థిగానే చూస్తారు. దీంతో తమకు కొరకరాని కొయ్యలా మారిన రేవంత్ రెడ్డిని టీఆర్ఎస్, వైసీపీ ఉమ్మడిగా టార్గెట్ చేస్తున్నాయని చెబుతున్నారు.
ప్రస్తుతం టీపీసీసీ రేసులో ముందున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అతనికే వస్తాయని కేసీఆర్, జగన్ భావిస్తున్నారట. రేవంత్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు వస్తే తమకు మరింత ఇబ్బందిగా మారుతారని కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో తమ ప్రత్యర్థికి కీలక పోస్టు రావడం వైసీపీకి ఇష్టం లేదు. అందుకే అతన్ని టార్గెట్ చేస్తూ రెండు పార్టీలు వ్యూహం రచిస్తున్నాయని చెబుతున్నారు. ఇంతకాలం తెలంగాణ రాజకీయాలను శాసించిన రెడ్లు.. కేసీఆర్ పాలనలో తాము నిర్లక్ష్యానికి గురయ్యామనే భావనలో ఉన్నారు. ఎలాగైనా అధికారం సాధించాలనే కసిలో ఉన్నారు. వారందరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి అశాకిరణంలా కనిపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు వస్తే తెలంగాలోని రెడ్లంతా ఒక్కటయ్యే అవకాశం ఉంది. ఇది గ్రహించిన కేసీఆర్ రేవంత్ రెడ్డికి చెక్ పెట్టేలా కొత్త వ్యూహం రచిస్తున్నారని చెబుతున్నారు.
తెలంగాణలో దివంగత వైఎస్సార్ కు ఇప్పటికి భారీగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న తెలంగాణ రెడ్డి నేతల్లో ఎక్కువ మంది వైఎస్సార్ వల్ల రాజకీయంగా ఎదిగినవారే. వీళ్లంతా ఇప్పుడు జగన్ రెడ్డితోనూ సత్ససంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో తెలంగాణలో వైసీపీని బలోపేతం చేస్తే కొందరు రెడ్డి నేతలు.. ఆ పార్టీలోకి వెళతారని కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. వైఎస్సార్ సెంటిమెంట్ ను రగిలించి కొందరు రెడ్డి నేతలతో కలిసి వైసీపీని బలోపేతం చేస్తే.. ఆ ప్రభావం రేవంత్ రెడ్డిపైనే ఎక్కువగా పడుతుందని ఆయన భావిస్తున్నారట. అందుకే కేసీఆర్ సూచనలతో తెలంగాణ రెడ్డి నేతలతో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారని చెబుతున్నారు. తెలంగాణలో వైసీపీ బాధ్యతలను వైఎస్ షర్మిల తీసుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదంతా కేసీఆర్, జగన్ ప్లాన్ లో భాగంగానే జరుగుతున్నాయంటున్నారు.
ఏపీ సీఎం జగన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సత్సంబంధాలున్నాయి. తెలంగాణలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. జగన్ కు పూర్తి మద్దతు ప్రకటించారు కేసీఆర్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణ చేస్తూ.. జగన్ ను ప్రశంసిస్తూ ప్రకటనలు చేశారు, జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా కేసీఆర్ ను స్వయంగా కలిసి ధన్యవాదాలు చెప్పారు. తర్వాత కూడా ఇద్దరు సీఎంలు పలు సార్లు సమావేశమయ్యారు. తనకు పూర్తిగా మద్దతుగా నిలుస్తున్న కేసీఆర్ కోసం.. జగన్ మోహన్ రెడ్డి తెలంగాణలో వైసీపీని బలోపేతం చేయవచ్చని, బలమైన రెడ్డి నేతలంతా రేవంత్ రెడ్డి వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. తమ నేత టీపీసీసీసీ అధ్యక్షుడిగా కాకుండా చేసేందుకు జగన్, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి అభిమానులు కూడా ఆరోపిస్తున్నారు.