సోనూ సూద్ కు గుడి! అందుకు అర్హుడ్ని కాదన్న రియల్ హీరో
posted on Dec 21, 2020 2:42PM
సినిమాల్లో విలన్ గా నటిస్తూ .. తన సేవా కార్యక్రమాలతో నిజ జీవితంలో రియల్ హీరోగా మారిన బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ కు గుడి కట్టారు. తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తాండా పరిధిలోని చెలిమితాండాలో రాజేశ్ అనే అభిమాని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రాజేశ్ కు సోనూ సూద్ అంటే ఎంతో అభిమానం. సోనూ చేసిన సేవా కార్యక్రమాలతో అభిమానం మరింతగా పెరిగింది. దీంతో సొంత ఖర్చుతో ఆయనకు గుడి నిర్మించాడు. సోనూ విగ్రహానికి రాజేశ్ తో పాటు స్థానికులు కూడా పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. సోనూ సూద్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
దేశ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు సోనూ సూద్. కష్టాల్లో ఉన్న పేదలకు బాసటగా నిలిచారు. ఆపన్నులకు సాయం అందించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో వందలాది మంది వలస కూలీల కోసం బస్సులు ఏర్పాటు చేసి.. వారి సొంత ప్రాంతాలకు పంపించారు ప్రజల కోసం సోనూ సూద్ చేపట్టిన కార్యక్రమాలతో ఎంతో మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. చెలిమితాండాకు చెందిన రాజేశ్ కూడా అలానే సోనూసూద్ కు వీరాభిమానిగా మారాడు. అయనకు గుడి కట్టి పూజలు చేస్తున్నాడు.
తనకు గుడి కట్టారన్న విషయం తెలుసుకున్న సోనూ సూద్ దానిపై స్పందించాడు. నాకెందుకండీ గుడి... నేను అందుకు అర్హుడ్ని కాదు అంటూ సోనూ సూద్ వినమ్రంగా బదులిచ్చారు. అయితే తనకు గుడి కట్టిన ప్రజల అభిమానానికి ముగ్ధుడ్ని అయ్యానంటూ ట్విట్టర్ లో వెల్లడించారు రియల్ హీరో.