ఒకే ముహూర్తానికి కేసీఆర్, హరీష్ రావు

 

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఇప్పటికే ఈ విషయం అనేక సందర్భాల్లో రుజువైంది. అసెంబ్లీ రద్దు చేయడానికి మంచిరోజు చూసుకున్నట్టే.. నామినేషన్ వేయడానికి కూడా ఆయన ముహూర్తం చూసుకున్నారు. తెలంగాణలో డిసెంబర్ 7 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ నెల 12 నుంచి 19 తేదీ వరకు నామినేషన్లు వేయడానికి అవకాశం ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు మంచి ముహూర్తాలు ఉండటంతో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేసీఆర్ కూడా ఈరోజే నామినేషన్ వేయనున్నారు. సిద్ధిపేట జిల్లా నందలూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేయనున్నారు. పండితుల ఆశీర్వచనాలు అందుకున్న తర్వాత నామినేషన్ పత్రాలపై సంతకం చేయనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గజ్వేల్‌కు వెళ్లి మధ్యాహ్నం 2:34 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించనున్నారు. మరోవైపు ఇదే సమయానికి హరీశ్‌రావు సిద్ధిపేటలో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు.