కూకట్ పల్లి బరిలో హరికృష్ణ తనయ
posted on Nov 14, 2018 9:27AM
.jpg)
పొత్తులో భాగంగా టీడీపీ కి 14 స్థానాలు కేటాయించారు.తాజాగా 9 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.మిగిలిన వాటిలో కూకట్ పల్లి నుంచి బరిలో ఎవరున్నారని అందరిలో ఉత్కంఠత మొదలైంది.ఏపీ నుంచి వచ్చి స్థిరపడినవారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూకట్‌పల్లి ఒకటి కావటంతో సీటు కోసం తీవ్రపోటీ నెలకొంది.అయితే ఇక్కడ నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు ఈ ప్రతిపాదనను పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా పోటీచేస్తే బాగుంటుందని పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.హరికృష్ణ కుమారుడు కల్యాణ్ రాం లేదా కూతురు సుహాసిని పోటీపై పార్టీలో చర్చ జరిగింది.కల్యాణ్ రాం ఆసక్తి కనబరచకపోవడంతో సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించినట్టు సమాచారం.సుహాసిని అభ్యర్థిత్వం ఖరారయితే తెలంగాణలో ఎన్టీఆర్ తర్వాత నందమూరి కుటుంబం నుంచి మళ్లీ ఆమే పోటీ చేసినట్లవుతుంది.కానీ పార్టీ సీనియర్ నేత పెద్ది రెడ్డి,మందాడి శ్రీనివాసరావు ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు.ఇప్పటికే ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారం ప్రారంభించారు.వీరే కాకుండా టీఆర్‌ఎస్ కార్పోరేటర్ కావ్యారెడ్డి భర్త హరీశ్ రెడ్డి చంద్రబాబును కలుసుకుని, తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.మరి చంద్రబాబు ఈ స్థానాన్ని నందమూరి కుటుంబానికి కేటాయిస్తారో లేదో? కేటాయిస్తే మాత్రం సుహాసినిని ఒప్పించే భాద్యత కూడా చంద్రబాబే తీసుకోవాలి.