సీబీఐ విచారణ.. కవిత యూటర్న్

ఢల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ నోటీసులు జారీ చేసిందనీ, విచారణకు తాను సహకరిస్తానని చెప్పిన తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అంతలోనే యూటర్న్ తీసుకున్నారు. సీబీఐ నుంచి నోటీసులు అందినట్లు స్వయంగా ప్రకటంచి, హైదరాబాద్ లోని తన నివాసంలో విచారణకు రెడీ అని ప్రకటంచిన కవిత.. శనివారం (డిసెంబర్ 3)న రోజంతా ప్రగతి భవన్ లో తండ్రి కేసీఆర్, న్యాయ నిపుణులతో చర్చల తరువాత యూటర్న్ తీసుకున్నారు.

ఇప్పుడు ఆమె సోమవారం (డిసెంబర్ 5) తన నివాసంలో సీబీఐ అధికారుల విచారణ సందర్భంగా వారు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు ఆమె శనివారం (డిసెంబర్ 3)న సీబీఐ అధికారికి రాసిన లేఖ తార్కానంగా చెప్పుకోవచ్చు. ఆమె సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి రాసిన లేఖలో   సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు.

 సీబీఐ నోటీసులు అందుకున్న తరువాత శనివారం(డిసెంబర్3) ఉదయం ప్రగతి భవన్‌కు వెళ్లి తన తండ్రి , సీఎం కేసీఆర్‌తోనూ, ఆయన సమక్షంలో పలువురు న్యాయనిపుణులతోనూ చర్చించారు.  ఆ చర్చల మేరకే ఎఫ్ఐఆర్  కాపీలు తీసుకోవాలని లేఖ రాశారు. ఆ లేఖ సమాచారాన్ని మీడియాకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే  సీబీఐ విచారణ సందర్భంగా   ఫిర్యాదు కాపీలు, ఎఫ్ఐఆర్ కాపీలు కవితకు అందజేస్తే వాటిని పూర్తిగా చదివి అర్థం చేసుకోవాల్సి ఉంది కనుక సీబీఐ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం ఇవ్విలేనని కవిత నిరాకరించే అవకాశం ఉంది.

ఒక వేళ సీబీఐ ఆ ఫిర్యాదు కాపీలు, ఎఫ్ఐఆర్ కవితకు అందజేయకుంటే అ విచారణకు హాజరయ్యేందుకు.. వివరణ ఇచ్చేందుకు ఆమె నిరాకరించేందుకే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే సోమవారం(డిసెంబర్5) కవిత సీబీఐ విచారణకు హాజరు కాకపోవడమో లేదా సీబీఐ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు నిరాకరించడమో చేస్తారు. సీబీఐ విచారణ విషయంలో కవిత యూటర్న్ తీసుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. దీంతో సోమవారం (డిసెంబర్ 5)న ఏం జరగబోతోందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది.