మార్చి పోతే సెప్టెంబర్ ఉంది.. రాజకీయాల్లో వైఫల్యంపై జనసేనాని!

విద్యార్థులు పరీక్షలో ఫెయిలై బాధపడుతుంటే.. స్నేహితులు, బంధువులు, తల్లిదండ్రులు ఓదారుస్తారు. మార్చిలో ఫెయిలైతే ఏమైంది సెప్టెంబర్ ఉందిగా శ్రద్ధగా పట్టుదలగా చదివి ఈ సారి పాసవుదువుగాని లే అంటారు. అదే ఆ విద్యార్థే తాను ఫెయిలయ్యాననీ, ఈ సారి గట్టిగా చదివి పాసౌతాననీ అంటే.. ఏంత నిర్లక్ష్యం.. సరిగా ప్రిపేర్ కాకుండా ఎందుకు ఉన్నావు. ఒక ఏడాది నష్టపోవడమంటే కెరీర్ లో ఎంత వెనుకబడిపోతావు అంటూ అక్షింతలు వేస్తారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2019 తన వైఫల్యాన్ని అంగీకరించడం కూడా విద్యార్థి పరీక్ష ఫెయిలవ్వడం లాంటిదేనని చెప్పుకుంటున్నారు. రాజకీయాల్లో తాను విఫలమయ్యాననీ, అయితే పట్టుదలగా ప్రయత్నిస్తున్నానని చెప్పారు.  హైదరాబాద్ శిల్పకళా వేదికలో  చార్టెడ్ అకౌంటెంట్స్ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించిన ఆయన జీవితంలో కష్టాలు, ఓటములను అధిగమించాలని చెప్పారు. చార్జెడ్ అక్కౌంట్స్ ఎంత కష్టమో తనకు తెలుసునన్నారు. అందుకే ఫెయిలయినా నిరాశ చెందకుండా మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన తననే ఉదాహరణగా చెప్పారు. రాజకీయాలలో తాను విఫలమయ్యానన్నారు. అయితే పట్టు వదలకుండా మళ్లీ ప్రయత్నిస్తున్నానని చెప్పుకొచ్చారు. 2019లో తాను ఫెయిలయ్యానని.. కానీ నిరాశ చెందకుండా.. పట్టువదలకుండా ప్రయత్నిస్తున్నాన్నారు.  వైఫల్యాలను కూడా తాను సానుకూల దృక్పథంతోనే చూడాలన్నారు.

తాను సమాజంలో మార్పు రావాలని కోరుకుంటున్నాననీ, అయితే అందుకోసం ఏమీ చేయకుండా కూర్చునే రకం తాను కాదనీ అన్నారు.  తాను విఫల  రాజకీయ నేతనన్న విషయాన్ని స్వయంగా అంగీకరించడానికి తనకేం అభ్యంతరం లేదనీ, ఓటమి నేర్పిన పాఠాలే భవిష్యత్ విజయానికి పునాదులనీ పవన్ అన్నారు.

 మార్చి పోతే సెప్టెంబర్.. సెప్టెంబర్ పోతే మార్చి.. ఇలా అవకాశాలు వస్తూనే ఉంటాయన్నారు. వైఫల్యం  విజయానికి   బాట వేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. తనకు తానే తానొక విఫల రాజకీయవేత్తనని పవన్ కల్యాణ్ చెప్పుకోవడం రాజకీయవర్గాలనే కాకుండా జన శ్రేణులను కూడా విస్మయ పరిచింది.  విద్యార్థులలో స్ఫూర్తి నింపడం అన్న పేరుతో పవన్ కల్యాణ్ పార్టీ శ్రేణుల్లో నిరాశను నింపుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.