నేను సునీత పక్షమే.. వివేకా హత్య కేసులో దోషులకు శిక్ష పడాల్సిందే.. షర్మిల

తన బాబాయ్ వైఎస్ వివేకానంద హత్య కేసులో దోషులకు శిక్ష పడాల్సిందేనని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల మరో సారి కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ఈ కేసులో న్యాయం కోరుతున్న వివేకా కుమార్తె సునీతకు న్యాయం జరగాలన్నారు. తాను పూర్తిగా ఆమె పక్షమేనని షర్మిల విస్పష్టంగా చెప్పారు. తాజాగా ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివేకా హత్య కేసును తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు. ఈ కేసులో తాను సీబీఐకి వాంగ్మూలమిచ్చానని చెప్పిన షర్మిల దానిని రివీల్ చేయడానికి నిరాకరించారు.

ఏపీ సర్కార్ మీద నమ్మకం లేదని వైఎస్ కుమార్తె డాక్టర్ సునీత అనడంలో ఎంత మాత్రం తప్పు లేదన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారని ఆ రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోందని ఆమె నమ్ముతున్నారనీ, అందులో తప్పేముందని అన్నారు. వివేకా హత్య కేసలో దోషులెవరో తేలాలనీ, వారికి శిక్ష పడాలనీ తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇక తెరాస సర్కార్ తనపై కక్ష పూరితంగా వ్యవహరించడంపై మాట్లాడుతూ.. హైదరాబాద్ లో తనను కారుతో సహా టూయింగ్ చేసి పోలీసు స్టేషన్ కు తీసుకు తీసుకువెళ్లి అరెస్టు చేయడం దారుణమన్నారు.

ఈ ఘటనపై తనకు మద్దతు పలుకుతూ అనేక మంది అండగా నిలిచారన్నారు.ఈ విషయంలో తన అన్న ఏపీ సీఎం జగన్ ఏమీ స్పందించకపోవడంపై ఆమె అదే మంత ముఖ్యమైన విషయం కాదన్నారు. ప్రజల స్పందనే తనకు ముఖ్యమన్నారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది వైఎస్సార్ టీపీయేనని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ముందస్తుకు అవకాశం లేదన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు.

తాను రాష్ట్రంలో 3500 కీలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశాననీ, ఇంకా చేస్తాననీ చెప్పిన షర్మిల ఎవరి కోసమో వెట్టి చాకిరీ చేయాల్సిన అవసరం తనకు లేదనీ, రాష్ట్రంలో సొంతంగానే అధికారంలోకి వస్తాననీ ధీమా వ్యక్తం చేశారు. తలంగాణలో వైఎస్ పాలన అందిస్తానన్నారు. ఏ పార్టీతోనూ పొత్తులు లేవన్ని విస్ఫష్టంగా చెప్పారు. తాను నాన్ లోకల్ అంటూ వస్తున్న విమర్శలకు కొట్టి పారేశారు. తాను ఇక్కడే చదివాననీ, ఇక్కడే ఉంటున్నాననీ చెప్పారు.