‘కాపు’ కాసేది ఎవరికో ?

అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అయినా, ఇప్పడు అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అయినా, కాపు సామాజిక వర్గానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత కాదన లేనిది. రాష్ట్ర జనాభాలో 15 శాతం పైగా ఉన్న  కాపు సామాజిక వర్గం ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే, ఆ పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయి. అందుకే, ‘కాపు’  ఓటు, ఏ పార్టీని కాపు కాస్తే, ఆపార్టీ అధికారంలోకి వస్తుందనే రాజకీయ విశ్వాసం బలంగా స్థిరపదిండి. ఆ కారణంగానే  కాపు  జనాభా అధికంగా ఉన్న ఉమ్మడి ఉభయ గోదావరి జల్లాలలో ఏ పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకుంటే, అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, ఒక నమ్మకం ఏర్పడింది. 

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు ఎన్నికల్లో కూడా  అదే జరిగింది. ఉభయ గోదావరి జిల్లాలలో మెజారిటీ సీట్లు గెలుచుకున్న పార్టీలే అధికారంలోకి వచ్చాయి. రాష్ట్ర విభజన అనంతరం 2014 లో జరిగిన అవశేష ఆంధ్రప్రదేశ్’ తొలి శాసన ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలోని 34 అసెంబ్లీ స్థానాలకు గాను 25 స్థానాలు తెలుగు దేశం పార్టీ గెలుచుకుంది. టీడీపీ అధికారంలోకి వచ్చింది.అలాగే, 2019 ఎన్నికల్లో  ఉభయగోదావరి జిల్లాలలోని 34 స్థానాలకు గాను, 27 స్థానాలు వైసీపీ గెలుచుకుంది.రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 

అదలా ఉంటే, రాష్ట్ర శాసన సభ ఎన్నికలకు ఇంకా సంవత్సరంన్నరకు పైగానే సమయం వున్నా,  ఎన్నికల పరుగు మాత్రం ఇప్పటికే ఊపందుకుంది.అధికార, ప్రతిపక్షాలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి.అందులో భాగంగా ఇప్పుడు ‘కాపు’ ఓటును చేరుకుందుకు తెలుగు దేశం,వైసీపీలతో పాటుగా బీజేపీ కుడా పావులు కదుపుతోంది. నిజానికి, తెలుగు దేశం ఆవిర్భావం మొదలు, కాపుసామాజిక వర్గం ప్రధానంగా టీడీపీతో కలిసి నడుస్తోంది.

అయితే, 2008 అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీ స్థాపించడంతో సామాజిక సమీకరణల్లో కొంత మార్పు వచ్చింది. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధారణ శాసనసభ ఎన్నికల్లో, ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో 18 శాతం పైగా ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. అయితే, ఆ తర్వాత చిరంజీవి తమ పార్టీని కాంగ్రెస్’లో విలీనం చేయడంతో 2014ఎన్నికల్లో, కాపు ఓటు తిరిగి (టీడీపీ)  సొంత గూటికి చేరింది. అలాగే, చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన టీడీపీతో చేతులు కలపడంతో ఇక తిరుగే లేక పోయింది. 

ఇక ప్రస్తుతానికి వస్తే,  ఎన్నికలు ఇంకా చాలా దూరంలో ఉన్నా, కాపు సామాజిక వర్గం మాత్రం, ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి’ మాటలు నమ్మి ఓటేస్తే కాపు రిజర్వేషన్ మాట దేవుడెరుగు కాపుల సంక్షేమం ఊసే లేకుండా మూడేళ్ళు గడిపేశారని కాపులు గుర్రుగా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కాపుల రిజర్వేషన్ కోసం చిత్త శుద్దితో కృషిచేశారని, కానీ, జగన్ రెడ్డి రిజర్వేషన్ విషయాన్ని పూర్తిగా అట కెక్కించారని , కాపు నేతలు ఆరోపిస్తున్నారు.నిజానికి,  2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు తెచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం అడ్డుపుల్ల వేసి  కాపు రిజర్వేషనను అడ్డుకుంది. అయినా, చద్రబాబు నాయుడు ప్రభుత్వం, జనరల్‌ కేటగిరిలో కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కోసం మరోప్రయత్నం చేసింది. అయితే, ఈసారి సుప్రీంకోర్టు అడ్డుపుల్ల వేసింది.

ఇక ఆ తర్వాత అధికారం చేపట్టిన జగన్ రెడ్డి ప్రభుత్వం కాపు రిజర్వేషన్’ అంశాన్ని పూర్తిగా అటకెక్కించింది. అందుకే, కాపు సామాజిక వర్గం చిరకాల స్వప్నం, కాపు రిజర్వేషన్ ఏదో విధంగా సాకారమావ్వాలంటే, అది ఒక్క చంద్రబాబుతో మాత్రమే సాధ్యమనే నిర్ణయానికి ఆ వర్గం ప్రజలు వచ్చారు. అందుకే, ఈ సారి ఎన్నికల్లో టీడీపీకి కాపు కాయాలనే నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, కాపు సామాజిక వర్గానికి చెందిన, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో చేతులు కలపాలని కాపు నేతలు కోరుకుంటున్నారు. 

అటు టీడీపీ ఇటు జనసేనే కాదు బీజేపీ కూడా కాపు ఓట్ల కోసం కుస్తీ పడుతోంది. గత ఎన్నికల్లో జగన్‌ కి మద్దతుగా నిలిచిన కాపు వర్గాన్ని ఈసారి తమవైపు తిప్పుకునేందుకు కాపు రిజర్వేషన్ అంశాన్ని, బీజేపీ   మళ్లీ తెరపైకి తెచ్చింది.ఇప్పటికే ఆపార్టీ నేత కన్నాలక్ష్మీనారాయణ సీఎం జగన్‌ కి లేఖ కూడా రాశారు. నిజానికి రాజకీయ పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నా, కాపు  సామాజిక వర్గం మాత్రం, నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇటీవల చంద్రబాబు నాయుడు గోదావరి  జిల్లాల పర్యటనలో అదే స్పష్టమైంది. ఈ  నేపధ్యంలోనే అధికార వైసీపీ, కాపు నేతలు ఆత్మీయ సమ్మేళనాలతో కాపులకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు.అయితే,మూడేళ్ళుగా కాపు నేస్తంతో కాలక్షేపం చేస్తున్న జగన్ రెడ్డి పాలనతో విసుగెత్తి పోయిన కాపు సామాజిక వర్గం ... చాలు జగన్ ..సెలవు జగన్’ అంటున్నది.