160 సీఆర్పీసీలో ఉన్న వెసులు బాటు మేరకే.. ఇంటి వద్దే కవితను విచారించనున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  సీబీఐ తెరాస ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది. కవితకు లిక్కర్ స్కాంలో నోటీసులు రావడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఎంత మాత్రం కాదు. అసలీ స్కాం బయట పడినప్పటి నుంచీ కవితపై ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆ కుంభకోణంలో తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పాత్ర కీలకం అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఒక దశలో తనపై ఆరోపణలు చేయరాదంటూ ఆమె కోర్టు కు వెళ్లి స్టే కూడా తెచ్చుకున్నారు. ఈ కుంభకోణం కేసులోనే కవితకు సన్నిహితుడిగా చెప్పే అభిషేక్ రావు అరెస్టయ్యారు. ఈ క్రమంలోనే కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై తెరాస రాజకీయ కుట్ర కోణం ఉందంటూ ఆరోపణలు గుప్పించింది. కవితను కమలం గూటికి చేరాలని ప్రలోభ పెట్టారనీ, అందుకు ఆమె ససేమిరా అనడంతోనే కుంభకోణంలో ఇరికించారనీ తెరాస ఆరోపణలు గుప్పించింది. అదే సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల వ్యవహారాన్నితెరమీదకు తెచ్చి దర్యాప్తునకు సీట్ ఏర్పాటు చేసి బీజేపీని ఇరుకున పెట్టేందుకు తెరాస ప్రయత్నించిందన్న చర్చ కూడా రాజకీయ వర్గాలలో జోరందుకుంది.

ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ  కవితకు నోటీసులు జారీ చేసింది. అందుకే కవితకునోటీసులు రావడంపై రాజకీయ ప్రకంపనలు ఏవీ చోటు చేసుకోలేదు. చివరికి కవిత కూడా తాను వీటి కోసమే ఎదురు చూస్తున్నట్లుగా స్పందించారు. అయితే ఆ సందర్భంగానే కవిత కుంభకోణంలో ప్రమేయంపై  తనకు సంబంధం లేదనీ,  ఈ విషయం సీబీఐకి కూడా అర్ధమైందన్న సంగతి వారిచ్చిన నోటీసుల ద్వారానే తెలుస్తోందన్నట్లుగా కవిత మీడియా ముందు బిల్డప్ ఇచ్చారు. తనకు సీబీఐ160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిందని చెప్పిన కవిత.. సోమవారం (డిసెంబర్ 6) విచారణకు హాజరు కావాల్సిందిగా కోరిందనీ చెప్పారు.

అయితే విచారణ ఎక్కడ జరగాలన్న ఛాయిస్ సీబీఐ తనకే ఇచ్చిందనీ, ఇదే తన నిజాయితీకి, నిర్దోషిత్వానికి తార్కాణమన్నట్లుగా మీడియాకు చెప్పారు. హైదరాబాద్, ఢిల్లీ ఎక్కడైనా సరే మీకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడే విచారణ జరుపుతామని సీబీఐ నోటీసులో పేర్కొందని కవిత వివరించారు. తాను సీబీఐని తన నివాసంలోనే విచారించాలని కోరారనని, ఆ మేరకు సోమవారం (డిసెంబర్ 6)  ఉదయం సీబీఐ అధికారులు తన నివాసానికే వచ్చితనను విచారిస్తారని కవిత పేర్కొన్నారు.  అలాగే కేవలం తనను వివరణ కోరడానికి మాత్రమే సీబీఐ తనకు నోటీసులు ఇచ్చిందని చెప్పారు. అయితే కవితకు గతంలో సహాయకుడిగా వ్యవహరించిన హైదరాబాద్‌ వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లి ఈ కేసులో ఇప్పటికే అరెస్టయితిహార్‌ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

శరత్‌చంద్రారెడ్డి కూడా అదే జైలులో ఉన్నారు. కవిత ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును కూడా ఇటీవలే ఈడీ విచారించింది.  ఈ క్రమంలోనే అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఈడీ  కవిత పేరు ప్రస్తావించిన 48 గంటల్లోనే  సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేయడం గమనార్హం.  అన్నిటికీ మించి కవితకు 160 సీఆర్పీసీ కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ సెక్షన్ కింద నోటీసులు అందుకున్న మహిళలు విచారణ ఎక్కడ జరగాలన్నది తామే ఎంచుకునే అవకాశం ఉంటుంది. అదే ఇదే సెక్షన్ కింద నోటీసులు అందుకున్న పురుషులు మాత్రం దర్యాప్తు సంస్థ ఎక్కడకు రావాలని సమన్ చేస్తే అక్కడకే విచారణకు రావాల్సి ఉంటుంది. ఆ వెసులు బాటు మేరకే కవిత తన విచారణ తన నివాసంలో  జరగాలని ఎంచుకున్నారు. ఏదో తన వివరణ తీసుకుని వెళ్లిపోవడమే తప్ప సీబీఐ విచారణకు అంతకు మించి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నట్లు మాట్లాడుతున్న కవిత.. శనివారం (డిసెంబర్ 3) ఉదయమే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ కావడం... పలువురు న్యాయ నిపుణులతో చర్చించడం చూస్తుంటే.. ఏదైనా జరగొచ్చన్న భావన కవితలో ఉందన్న సంగతి అవగతమౌతుంది.

అంత కంటే ముందు అరోరా రిమాండ్ రిపోర్టులో తన పేరున్నట్లు బయటకు రాగానే కవిత మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసుకుంటే చేసుకోండి అనడమే కాకుండా.. రిమాండ్ రిపోర్టులో తన పేరు ప్రస్తావన వెనుక కమలం పెద్దలున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు మోడీ కంటే ఈడీ రావడం బీజేపీ దుష్ట సంస్కృతిలో భాగమేనని అన్నారు. ఆ తరువాత నోటీసులు అందగానే న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించడం.. వంటి సంఘటనలన్నీ కవిత సీబీఐ నోటీసులపై బయటకు కనిపిస్తున్నంత ధీమాగా లేరని చెప్పకనే చెప్పినట్లు కనిపిస్తోంది.