తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు ఉన్నట్లా లేనట్లా?

తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. గత ఆగస్టులోనే రద్దు చేసినప్పటికీ ఆ విషయాన్ని మాత్రం అక్టోబర్ నెల చివరిలో బయటపెట్టింది. అందుకు కారణం పెద్దగా ఊహాతీతమైనదేమీ కాదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను రక్షించడానికేనని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషణలు చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ, ఎమ్మెల్సీ కవిత సీబీఐ బోనులో నిలబడకుండా కాపాడుకునేందుకే తెలంగాణలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుందన్న చర్చ అప్పట్లో రాజకీయ వర్గాలలో జోరుగా సాగింది.   అయితే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో సీబీఐకి జనరల్ కన్సెంట్ రద్దు చేయడానికి ముందే ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణలో సోదాలు నిర్వహించింది. కవిత సన్నిహితుడు బోయనపల్లి అభిషేక్ రావును అరెస్టు చేసింది.   అప్పుడెప్పుడూ రాష్ట్రంలో సీబీఐకు జనరల్ కన్సెంట్ రద్దయ్యిందని బయటపెట్టని కేసీఆర్  సర్కార్    కవిత వద్దకు సీబీఐ వచ్చేస్తున్నదా అన్న అనుమానం కలగగానే దానిని బయట పెట్టారని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి విదితమే.  

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో తెలంగాణలో మరిన్ని సోదాలను, కవిత సహా మరింత మంది విచారణను సీబీఐకి జనరల్ కన్సెంట్ నిరాకరిస్తూ తెలంగాణ సర్కార్ జారీ చేసిన జీవో ఇసుమంతైనా అడ్డుకోలేదని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషణలు చేశారు.  ఇప్పుడు ఢిల్లీ కుంభ కోణం కేసులో కవితను సీబీఐ హైదరాబాద్ లోనే, అదీ ఆమె నివాసంలోనే విచారించనుంది. దీంతో అప్పటి విశ్లేషకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అక్షర సత్యాలని తేలిపోయింది.

లిక్కర్ స్కాంలో సీబీఐ విచారణకు హైదరాబాదే సేఫ్ ప్లేస్‌గా కవిత భావిస్తున్నారు. ఢిల్లీలో అయితే ఏం జరుగుతుందో తెలియదు కనుక,  ఎందుకైనా మంచిదని హైదరాబాద్ ను అందులోనూ తన నివాసాన్ని ఎంచుకున్నారు. అలాగే హైదరాబాద్‌లో విచారణ అంటే.. జనరల్ కన్సెంట్ రద్దు అంశం ఆటంకం అవుతుందని ఊహించిన సీబబీఐ వ్యూహాత్మకంగా ఢిల్లీ ఆర్ హైదరాబాద్ అని  కవితకు ఆప్షన్ ఇచ్చిందని కూడా అంటున్నారు.

ఇప్పుడు జనరల్ కన్సెంట్  రద్దు ఉన్నట్టా లేనట్టా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే పరిశీలకుల కథనం ప్రకారం ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన బిడ్డను రక్షించుకోవడం కోసం కేసీఆర్ వ్యూహాత్మకంగా జనరల్ కన్సెంట్ రద్దు చేసినా.. ఆ రద్దుకు ముందే నమోదైన కేసుల దర్యాప్తు విషయంలో సీబీఐ యథేచ్ఛగా ముందకు సాగే అవకాశం ఉంటుంది. అలాగే రాష్ట్ర బయట నమోదైన కేసులలో జనరల్ కన్సెంట్ రద్దైన రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉంటే.. వారిని సీబీఐ విచారించడాన్ని ఆ రద్దు ఏ విధంగానూ అడ్డుకోలేదు. అంటే ఎమ్మెల్సీ కవితకు ఈ జనరల్ కన్సెంట్ రద్దు వల్ల ఎలాంటి ఊరటా లభించే అవకాశం లేదు. దీంతో తన బిడ్డను కాపాడుకోవడం కోసం కేసీఆర్ చేసిన జనరల్ కన్సెంట్ రద్దు ఒక విఫలప్రయత్నమేనని పరిశీలకులు అంటున్నారు.