ఆ రోడ్డు పేరు మార్చి... ఔరంగజేబు అన్న పేరు పెట్టారు! ఎందుకో తెలుసా?
posted on Feb 6, 2017 3:32PM

అది ఢిల్లీ నడి బొడ్డులో ఒక రోడ్డు! పేరేంటో తెలుసా? డల్హౌసీ రోడ్! అవును, మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్నాళ్లైనా ఇంకా బ్రిటీషు వాడైన డల్హౌసీ పేరే వుండేది. కాని, ఎట్టకేలకు కాలం కలిసి వచ్చి పేరు మార్చారు. ఇప్పుడు నియంతలా పరిపాలించిన డల్హౌసీ పేరు కాక షిఖో మార్గ్ అంటారు ఆ రోడ్డుని! మరయితే ఈ షిఖో ఎవరు అంటారా?
దారా షిఖో.. ఈ పేరు సాధారణంగా మనం విని వుండి ఛాన్సే వుండదు. కాని, చరిత్ర తెలిసిన వారికి అతడెవరో బాగానే తెలుసు! మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు అన్న దారా షిఖో! అయితే, బ్రిటీషు వాడి పేరొద్దని మొఘల్ రాజులకు సంబంధించిన అంతగా పేరులేని ఈ షిఖోను నెత్తికెత్తుకోవటం దేనికి అని ఎవరికైనా డౌట్ రావచ్చు! కాని, ఇక్కడే అసలు ట్విస్ట్ వుంది. షాజహాన్ పెద్ద కొడుకైన దారా షిఖో విధి సహకరించి వుంటే మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యి వుండేవాడు. కాని, అలా జరగలేదు. అతడి తమ్ముడైన కర్కశ వీరుడు ఔరంగజేబు అతడ్ని మొదట బంధించి జైలులో పెట్టి చివరకు నిర్ధిక్షిణ్యంగా చంపించి వేశాడు!
దారా షిఖో పేరు విజయ్ చౌక్ కి దగ్గర్లోని డల్హౌసీ మార్గ్ కి పెట్టడానికి కారణం ఆయన షాజహాన్ కొడుకు, ఔరంగజేబు అన్న అవ్వటం మాత్రమే కాదు. ఆయన తన జీవితాంతం భారతదేశంలోని హిందూ, ముస్లిమ్ ల మధ్య సఖ్యత కోసం తపించాడు. ఎంతో కృషి చేశాడు. అందుకే, మోదీ సర్కార్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ చేత షిఖో మార్గ్ ఏర్పాటు చేయించింది! చరిత్రలో ఎన్నో లక్షల మందిని, ముఖ్యంగా, హిందూ, సిక్కు మతాల వాళ్లని చంపాడని పేరున్న ఔరంగజేబుకే ఢిల్లీలో ఒక రహదారి వున్నప్పుడు ఆయన చేతుల్లో చచ్చిపోయిన గొప్ప వీరుడు, దారా షిఖోకు మాత్రం ఎందుకు వుండకూడదు? ఇది నిజంగా అందరూ స్వాగతించాల్సిన పరిణామం!