ఈ మంత్రిగారు అసెంబ్లీలోనే చంపి పాతరేస్తారట..?

 

భారతదేశంలో చట్టసభలకు ఒక చరిత్ర ఉంది..ప్రజల సమస్యలకు పరిష్కారాలు కనుగొనేందుకు ప్రజాప్రతినిధులు ఒకచోట కూర్చొని చర్చించుకునేందుకు వీలుగా రాజ్యాంగం వెసులుబాటు కల్పించింది. ఎంతో మంది రాజకీయ ఉద్ధండులు ప్రజా సమస్యలపై తమ గళం వినిపించిన సందర్భాలు ఎన్నో..మరెన్నో..అలాంటి చట్టసభలు నేడు వ్యక్తిగత విమర్శలకు, ప్రజా ప్రతినిధుల బలాబలాలు తేల్చుకునేందుకు వేదికలుగా మారుతున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ పరువు ప్రతిష్టలను మంటగలిపే ఘటన ఒకటి జరిగింది. వస్తు, సేవల పన్ను విషయంపై శాసనసభలో నిన్న చర్చ జరిగింది...ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ఐటీ, సాంకేతిక విద్యల శాఖా మంత్రి ఇమ్రాన్ అన్సారీ, ప్రతీపక్ష పార్టీ నేత దేవేందర్ రాణాను సభలోనే చంపి పాతరేస్తానంటూ బెదరించారు. దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ..జమ్మూకశ్మీర్‌లో మాత్రం అమల్లోకి రాలేదు. ఆ రాష్ట్ర అసెంబ్లీ అందుకు ఆమోదించకపోవడమే దీనికి కారణం. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని..ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ భావించింది. ఇందులో భాగంగానే నిన్న జరిగిన సమావేశంలో జీఎస్టీని కశ్మీర్‌లోనూ అమలు చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ రాణా ప్రభుత్వాన్ని నిలదీశారు..తాను పన్నులు ఎగ్గొట్టలేదని..చీకటి వ్యాపారాలు చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అధికార పక్షానికి బదులిచ్చారు..ఓ వైపు ఆయన మాట్లాడుతుండగానే..మంత్రి ఇమ్రాన్ అన్సారీ ఆగ్రహంతో..నేను తలచుకుంటే నిన్ను ఇక్కడే చంపి పాతరేయగలను..నీ దొంగ వ్యాపారాలు నాకు తెలుసు..కశ్మీర్ మొత్తంలో నీ కంటే పెద్ద దొంగ ఎవరూ లేరు. నీకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో మాకు తెలియదా..అంటూ బెదిరింపులకు దిగారు..దీంతో అధికార విపక్ష సభ్యులు కుర్చీలపైకి ఎక్కి నిరసన తెలియజేశారు..మంత్రి చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా సమాధానం చెప్పాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు డిమాండ్ చేశారు. ఇవి కాస్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu