కేసీఆర్ పిచ్చి చంద్రబాబుకు అంటుకుందా..?
posted on Jul 5, 2017 4:49PM
.jpg)
జాతకాలు, ముహూర్తాలు, వాస్తుపై ఎవరి నమ్మకం వాళ్లది..కొందరికి ఇందులో మంచి జరిగి ఉండవచ్చు..మరి కొందరు వీటిని మూఢనమ్మకాలుగా కొట్టిపారేయవచ్చు. అయితే సాధారణ జనానికి ఇందులో ఏం జరిగినా..జరక్కున్నా పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏం లేదు..కానీ ప్రజా జీవితంలో ఉన్న నేతలకు అది కూడా పాలకులకు ఇలాంటి వాటిపై పిచ్చి ఉంటే అది చాలా మందికి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో జాతకాలు, వాస్తుపై బాగా నమ్మకం ఉన్న రాజకీయ నాయకుడు ఎవరు అంటే టక్కున వచ్చే సమాధానం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనే చెబుతారు. ఆయన అడుగు తీసి అడుగు వేయాలంటే పండితుల సలహాలు తీసుకోకుండా చేయరని టాక్. చివరకు ఈ పిచ్చి ఎక్కడికి వెళ్లిందంటే వాస్తు బాగోలేదని ఏకంగా సచివాలయాన్నే కూల్చి కొత్తది కడతా అన్నంతగా..అయితే అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో గులాబీ బాస్ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. బేగంపేట క్యాంపు ఆఫీసులో తనకు ముందు ఉన్న ముఖ్యమంత్రులకు కలిసిరాకపోవడానికి కారణం వాస్తు దోషమే అని భావించి..పక్కా వాస్తుతో, అత్యాధునిక సదుపాయాలతో ఏకంగా కొత్త క్యాంపు ఆఫీసు నిర్మించారు కేసీఆర్.. అలాంటి వాస్తు, జ్యోతిష్యాల పిచ్చి ఇప్పుడు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అంటుకుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు సీఎంగా వ్యవహరించిన సమయంలో ఇలాంటి వాటికి ఆమడ దూరంలో ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ పని చేయాలన్నా పండితులను సంప్రదిస్తున్నారు. వాస్తు అంటే చాలు అటెన్షన్ అయిపోతున్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని మూడు దశాబ్దాల పాటు ఉన్న ఇంటిని కూల్చడమే కాకుండా ..కోట్లు ఖర్చు చేసి కొత్త ఇంటిలో గృహప్రవేశం చేశారు. అంతేనా టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు కూడా వాస్తు ప్రకారం మార్పులు చేయించారు. ఇప్పుడు తాజాగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నూతనంగా నిర్మించిన సచివాలయానికి వాస్తు దోషాలు ఉన్నాయని చెప్పడంతో వాటిని సరిదిద్దే పనిలో పడ్డారు ఏపీ సీఎం..సచివాలయం వద్ద ప్రస్తుతం నిర్మించిన ప్రహరీ గోడను కూల్చి కొత్తగా మరో గేటు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న నాలుగు గేట్లకు అదనంగా మరో గేటు నిర్మిస్తున్నారు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాస్తు పేరుతో ఎన్ని కోట్లు ఖర్చు చేశారో లెక్కే లేదు..ఎందుకంటే ఆ సొమ్మంతా వారు కష్టపడి సంపాదించింది కాదు కదా..? అంతా ప్రజాధనమే కదా అని కొందరు విమర్శిస్తున్నారు.