మోదీ కీలక నిర్ణయాలకు కేసీఆర్ ఎందుకు మద్దతిస్తున్నారు?

 

కాబోయే రాష్ట్రపతి వద్ద కేసీఆర్ నూటికి నూరు మార్కులు కొట్టేశారు! ఆయన చేత శభాష్ అనిపించుకున్నారు! తనకు మరెక్కడా ఇంత ఘనస్వాగతం లభించలేదని రామ్ నాథ్ కోవింద్ కేసీఆర్ ని పొగిడేశారు! అంతే కాదు, ఆయన తనకు దారి పొడవునా ఎదురైన భారీ హోర్డింగ్ లు ఎంతగానో ఆనందం కలిగించాయని చెప్పుకొచ్చారు! ఇదంతా చేసిన కేసీఆర్ ను ఆయన ఫుల్ గా మెచ్చేసుకున్నారు. పనిలో పనిగా యూపీ వాడినైన తనకు అర్థమయ్యేలా చక్కటి హిందీలో కేసీఆర్ ప్రసగించినందుకు ఉప్పొంగిపోయారు! మొత్తం మీద ఇంకా ప్రెసిడెంట్ అవ్వని ఫ్యూచర్ రాష్ట్రపతి వద్ద తెలంగాణ సీఎం సూపర్ టాక్ సంపాదించుకున్నారు!

 

రామ్ నాథ్ తాను ప్రెసిడెంట్ అయ్యే పనిలో వున్నారు కాబట్టి మద్దతిస్తోన్న కేసీఆర్ ని పొగిడారని భావించలేం. అది నిజమే అయినా … బీజేపిలో కీలక నేతైన వెంకయ్య నాయుడు కూడా  గులాబీ బాస్ ని ఆకాశానికి ఎత్తారు. నోట్ల రద్దులో, జీఎస్టీ విషయంలో, ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు అంశంలో… కేసీఆర్ బేషరతుగా సపోర్ట్ చేశారని అన్నారు. ఎన్డీఏలో లేని మరో నేత ఎవరూ ఇలా లేరన్నారు వెంకయ్య! నిజంగా కూడా ఒక రాష్ట్రం చేతిలో వుంచుకుని మోదీతో ఇంత సఖ్యంగా వున్న నాన్ ఎన్డీఏ సీఎం ఎవరూ లేరు! మమత, అరవింద్, నితీష్ లాంటి వారి సంగతి మనకు తెలిసిందే కదా…

 

ఇంతకీ… ఆ మధ్య అమిత్ షా వచ్చి టీఆర్ఎస్ మీద నానా ఆరోపణలు చేసి నల్గొండ పర్యటన చేసి వెళ్లారు. కాని, ఇప్పుడు వెంకయ్య పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కేసీఆర్ కూడా మోదీని వీలైనప్పుడల్లా మంచి వాడని చెబుతూనే వున్నారు. ఇక దత్తాత్రేయ అయితే కేసీఆర్ తో హ్యాపీగా వేదికలు పంచుకుంటారు! ఇదంతా దేనికి సంకేతం? పైకి పరిణతి చెందిన రాజకీయం అని చెప్పుకున్నా… రాబోయే ఎన్నికల పొత్తుల విషయం కూడా ఇందులో ఎంతోకొంత కనిపిస్తోందని చెప్పవచ్చు! ముస్లిమ్ ఓటు బ్యాంక్ భారీగా వున్న టీఆర్ఎస్ రాబోయే ఎన్నికల్లో ఓటింగ్ కి ముందు పొత్తు పెట్టుకోకున్నా తరువాత ఎన్డీఏలో చేరే ఛాన్స్  పుష్కలంగా వుంటుంది. ఆ ఆప్షన్ తెరిచి వుంచుకోటానికే కేసీఆర్ కేంద్ర బీజేపితో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మోదీ వేవ్ దేశమంతా వున్నప్పుడు ఊరికే కేజ్రీవాల్ , మమత బెనర్జీలాగా ఆరో్పణలు, విమర్శలు చేసి సాధించేదేమీ లేదు కాబట్టి అంశాల వారీగా మద్దుతు తెలుపుతు వుంటే భవిష్యత్ రాజకీయ అవసరాలు ఎప్పుడైనా తీర్చుకోవచ్చని కేసీఆర్ వ్యూహం కావచ్చు!

 

టీఆర్ఎస్ , బీజేపి ముందు ముందు దగ్గరవ్వటానికి మరో కారణం కూడా బలంగా పని చేసే అవకాశం వుంది. అదే కాంగ్రెస్! తెలంగాణలో టీఆర్ఎస్ కి, దేశ వ్యాప్తంగా బీజేపికి… ఇద్దరికీ కాంగ్రెస్సే ప్రత్యర్థి. కాబట్టి రెండు పార్టీలు ముందు ముందు ఎన్నికల్లో కలిసి పని చేయటానికి కాంగ్రెస్ కూడా కారణం కావచ్చు! మరి ఇప్పుడు టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తోన్న రామ్ నాథ్ కోవిందే 2019లో ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వంతో ప్రమాణస్వీకారం చేయిస్తారు! ఆ రోజు టీఆర్ఎస్ నాయకులు కూడా మంత్రులుగా రామ్ నాథ్ సమక్షంలో వుంటారా? వేచి చూడాల్సిందే!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu