దార్శనికుడు చంద్రబాబుకు జైలు.. వివేకా హత్యకేసు నిందితుడు భాస్కర్ రెడ్డికి బెయిలు!

ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 22) ఆయన్ను సీఐడీ కస్టడీకి అప్పగించింది. గత నాలుగు రోజులుగా వాయిదాల పర్వంగా సాగిన ఈ తీర్పు శుక్రవారం రానే వచ్చింది. రెండు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే రెండు రోజుల కస్టడీ తేదీలను మాత్రం కోర్టు వెల్లడించలేదు. తేదీలను తర్వాత ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీఐడీ కోరగా ఐదు రోజులు కాకుండా రెండు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ తెలిపింది.  

కాగా, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, సీఎం జగన్ బాబాయ్ వివేకా హత్యకేసులో నిందితుడికి బెయిల్ లభించింది. వివేకా హత్య కేసును ఏళ్లుగా సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ, సీఎం జగన్ కు సోదరుడైన వైఎస్ అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో   నిందితులుగా సీబీఐ పేర్కొనగా.. ఎంపీ అవినాష్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పటి వరకూ హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లో ఉండగా.. ఇప్పుడు ఆయనకు కూడా బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం భాస్కర్ రెడ్డికి 12 రోజుల పాటు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైంది. భాస్కర్‌ రెడ్డి అనారోగ్యంగా ఉన్నట్టు కోర్టుకు చంచల్‌ గూడ సూపరింటెండెంట్‌ రిపోర్ట్‌ ఇవ్వడంతో ఆయనకు వైద్య చికిత్స అందించాలని సీబీఐ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే, భాస్కర్ రెడ్డికి హైదరాబాద్‌ లోనే చికిత్స పొందాలని, హైదరాబాద్‌ ను విడిచివెళ్లవద్దని సీబీఐ కోర్టు  షరతులు విధించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా భాస్కర్ రెడ్డి జైలు నుంచి శుక్రవారం (సెప్టెంబర్‌ 22)న విడుదలయ్యారు. 12 రోజుల బెయిల్ అనంతరం కూడా ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి రాకపోతే కనుక మరికొన్ని రోజులు బెయిల్ పొడిగించే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. అనారోగ్యం, చికిత్స పేరుతో ఇలా బెయిల్ పొడగించిన కేసులు ఇప్పటికే చాలా చూడగా.. ఇప్పుడు వివేకా హత్యకేసు నిందితుడు భాస్కర్ రెడ్డి బెయిల్ కథ కూడా ఇలా కొనసాగినా ఆశ్చర్యం లేదంటున్నారు. 

కాగా, ఒకవైపు కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేని స్కాంలో చంద్రబాబును అక్రమంగా, కేవలం కక్షపూరితంగా కేసులు పెట్టి ఆయనను జైలుకు తరలించి.. మాజీ మంత్రి వివేకాను క్రూరాతి క్రూరంగా గొడ్డలితో నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించాలని ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను బెయిల్ పై బయటకి వదలడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒక వైపేమో 43 వేల కోట్ల అవినీతి కేసులలో ఏ1 ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు దశాబ్ద కాలంగా బెయిల్ పై ఉంటూనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. బెయిల్ పై ఉండే కోర్టుల అనుమతితో  దేశ విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. కనీసం నాలుగేళ్లుగా కోర్టు విచారణకు కూడా హాజరుకాకుండా సాకులు చెప్తున్నారు. ఇదే కేసులలో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి ఢిల్లీలో పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ అవినీతి కేసు ఎప్పటికి తెలుస్తుందో కూడా తెలియడం లేదు. 

మరోవైపు వివేకా హత్యకేసులో నిందితులు యథేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొన్న ఎంపీ అవినాష్ ఈసారి  ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మందీ మార్బలంతో స్థానికంగా చెలరేగిపోతూ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా అనారోగ్య కారణాలతో జైలు నుండి బయటకి వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎందరో యువతీ, యువకుల భవితకు బంగారు బాట వేసిన చంద్రబాబును మాత్రం జైలుకు తరలించారు. కనీసం ఒక్క అవినీతి ఆధారం చూపించలేకపోతున్న సీఐడీ కస్టడీకి అప్పగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలపై నగరాలు, పట్టణాలు గ్రామాలలో రచ్చబండలు అన్న తేడా లేకుండా చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు సంఘీభావంగా జనం స్వచ్చందంగా రోడ్ల పైకి వస్తున్నారు.