కారు డ్రైవర్ ఖాతాలోకి 9వేల కోట్లు.. ఆ తరువాత ఏమైందో తెలుసా?
posted on Sep 23, 2023 9:47AM
బ్యాంకు అధికారులు పొరపాటుగానో, గ్రహపాటుగానో చేసిన తప్పు వారికి పెద్ద తలనొప్పి తీసుకువచ్చింది. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి 21 వేల రూపాయలను వదులుకోవడమే కాకుండా, ఓ వ్యక్తికి వాహన రుణం కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే.. చెన్నైలోని మర్కెంటైల్ బ్యాంకు పొరపాటుగా తొమ్మిదివేల కోట్ల రూపాయలను ఓ వ్యక్తి ఖాతాలో జమ చేసింది. వెంటనే జరిగిన పొరపాటును గ్రహించి సరిదిద్దుకునేందుకు ఆ వ్యక్తికి ఫోన్ చేసి మొత్తం సొమ్మును తమకు అప్పగించాలని కోరారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి అంత సొమ్ము తన ఖాతాలో ఎలా జమ అయ్యిందో.. అసలు అది నిజమో కాదో తెలుసుకునేందుకు తన స్నేహితుడికి ఓ 21 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసి చూశాడు. ఆ తరువాతే అతడికి బ్యాంకు అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. అదీ కథ..
అలా బ్యాంకు అధికారుల పొరపాటు వల్ల 9 కోట్ల రూపాయలు జమ అయిన ఖాతాదారులు ఓ కారు డ్రైవర్. అతడి పేరు రాజ్ కుమార్. ఈ నెల 9వ తేదీన అతడి మొబైల్ ఖాతాకు మర్కంటైల్ బ్యాంకు నుంచి 9వేల కోట్ల రూపాయలు జమ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. కంగుతిన్న రాజ్ కుమార్ అసలా మెసేజ్ నిజమా కాదా పరీక్షించేందుకు తన స్నేహితుడికి 21 వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేస్తే ట్రాన్స్ ఫర్ అయ్యాయి. దీంతో వేల కోట్ల రూపాయల అధిపతిని అయ్యానని ఆనందించే లోపే బ్యాంకు అధికారులు జరిగిన పొరపాటును వివరించి తక్షణమే ఆ సొమ్ము మొత్తం తమకు అప్పగించాలన్నారు. దీంతో రాజ్ కుమార్ ఓ న్యాయవాదిని సంప్రదించాడు.
చర్చల తరువాత బ్యాంకు అధికారులు తమ పొరపాటుకు మూల్యం చెల్లించుకోవడానికి అంగీకరించారు. ఆ కారు డ్రైవర్ తన మిత్రుడికి ట్రాన్స్ ఫర్ చేసిన 21 రూపాయలూ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదనీ, అంతే కాకుండా మిగిలిన సొమ్మును తమకు అప్పగించినందుకు ప్రతిఫలంగా ఆ డ్రైవర్ కు వాహన రుణం ఇవ్వడానికీ అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు. కథ సుఖాంతమైంది. అయితే ఇప్పుడు నెటిజన్లు మాత్రం అసలు ఆ 9 వేల కోట్ల రూపాయల సంగతేంటి? వాటి కథాకమామిషు ఏమిటని బ్యాంకును నిలదీస్తున్నారు. అంత సొమ్మును ఎవరికి చెందినదీ, దానికి సంబంధించి లెక్కలూ అవీ సక్రమంగా ఉన్నాయా. అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.