విశాఖ జగన్ ఈగో శాటిస్ ‘ఫ్యాక్షన్ ’రాజధానేనా?

జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విశాఖ కేంద్రంగా  పాలనకు సిద్ధమైంది. ఇందు కోసం దసరా ముహుర్తాన్ని కూడా నిర్ణయించింది. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే  ఈ విషయాన్ని ఇటీవలి కేబినెట్ సమావేశంలో వెల్లడించారు.  ఇందుకోసం విశాఖలో ఇప్పటికే కార్యాలయాలు, సీఎం నివాసం కూడా సిద్దమవుతున్నట్లు ఆయనే చెప్పారు. రాబోయే ఎన్నికలను అక్కడి నుంచే ఎదుర్కోవాలని వైసీపీ నిర్ణయించింది. అందుకే ఇప్పటికిప్పుడు ఎలాగైనా పరిపాలన విశాఖ నుండే చేయాలని కసరత్తులు ప్రారంభించింది. నిజానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే మూడు రాజధానులంటూ ప్రకటించింది.  అనంతరం అమరావతి రైతుల నిరసనలు, కోర్టు చిక్కులు, కరోనా కారణంగా మూడు రాజధానులకు బ్రేకులు పడ్డాయి. కోర్టుల నుండి తీవ్ర ఒత్తిడితో మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం అదే అసెంబ్లీ సాక్షిగా వెనక్కి తీసుకుంది.

ఇప్పుడు కూడా ఏపీ రాజధానిగా అమరావతి అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయినా  ప్రభుత్వం విశాఖ రాజధాని అంటూ ప్రకటనలు చేస్తూనే ఉంది. రాజధానుల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు చెప్పినా జగన్ సర్కార్ విశాఖలో రాజధాని ఏర్పాట్లు చేపడుతూనే ఉంది. కొన్ని నెలలుగా దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలిస్తామని ప్రకటిస్తున్న సీఎం జగన్ తాజాగా కేబినెట్లోనూ ఈ మేరకు ప్రకటన చేసేశారు. ఆ దిశగా విశాఖకు రాజధానిని తరలించేందుకు విజయదశమిని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అంతే కాకుండా రుషికొండ వద్ద నిర్మిస్తున్న భవనాల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్, కీలక హెచ్వోడీ కార్యాలయాలను విశాఖకు తరలించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు వేగంగా జరుగుతోంది. ఇదే విషయమై తాజాగా.. మంత్రి అమర్నాధ్ మాట్లాడుతూ అక్టోబర్ 23వ తేదీనుండి జగన్ వైజాగ్ లోనే ఉంటారని ప్రకటించారు. 

ప్రస్తుతం విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంపు కార్యాలయం, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, నివాసాలు, అవసరమైన సిబ్బంది క్వార్టర్స్ తదితరాల ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులు బిజీగా ఉన్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వారంలో రెండు రోజులు జగన్ వైజాగ్ లో ఉండబోతున్నట్లు తెలిసింది. అదికూడా గురు, శుక్ర వారాల్లో విశాఖపట్నంలో ఉంటారని మిగిలిన రోజుల్లో అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటనలు చేయబోతున్నట్లు చెప్తున్నారు. అయితే, జగన్ ఏ ఉద్దేశ్యంతో విశాఖ నుండి పాలన చేయనున్నారన్న చర్చ ప్రజల మధ్య జరుగుతుంది. చట్ట పరిధిలో విశాఖకు రాజధాని తరలించడం సాధ్యమయ్యేది కాదు. కోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పగా.. చట్టాన్ని అతిక్రమించి రాజధాని తరలించే పరిస్థితి లేదు.

రాజధాని అమరావతి కోసం స్థానిక రైతుల వద్ద తీసుకున్న భూములు, వారితో ప్రభుత్వం చేసుకున్న చట్టబద్దమైన ఒప్పందాల ప్రకారం అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి. లేదంటే రైతులకు కొన్ని వేల కోట్లు పరిహారం చెల్లించాలి. వీటిని ఉల్లంఘించి రాజధానిని తరలించడం సాధ్యం కాదని హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. అంతేకాదు దీనిపై చట్టాలు కూడా చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లేదని విస్పష్టంగా పేర్కొంది. ఈ అంశంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా కోర్టు నిర్ణయం డిసెంబర్ లో ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా రాజధాని తరలింపు సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు.

దీనిని బట్టి చూస్తే జగన్ ఇప్పుడు విశాఖకు రాజధాని తరలింపు సాంకేతికంగా జరిగే పని కాదు. కానీ, సీఎం ఎక్కడ నుంచైనా పరిపాలన చేసే అవకాశం ఉంటుంది అని స్వయంగా జగనే చెబుతున్నారు కనుక విశాఖ నుండి పరిపాలన చేయాలని ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్,  వైసీపీ చెప్తున్నట్లుగా ఇది రాజధాని తరలింపు కాదు కేవలం సీఎం ఇల్లు, ఆఫీసు. క్యాంప్ ఆఫీసు తరలింపు మాత్రమే. ఇది కూడా కేవలం విశాఖ నుండి పాలన చేశానని చెప్పుకోవడానికీ,  జగన్ తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం మాత్రమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుండి రాజకీయ లబ్ది పొందడం కోసమే ఎన్నికలకు ముందు కంటితుడుపుగా ఈ విశాఖ నుండి పాలన డ్రామా మొదలు పెట్టినట్లు చూడాల్సి ఉంటుంది. అయితే, సీఎం తన ఇల్లు, ఆఫీసు తరలిస్తే రాజధాని కాదు.. దానికి ఒక చట్టం ఉంది.. అనుమతులు కావాలి.. కేంద్రం నోటిఫై చేయాలి.. ప్రభుత్వ అధికారిక ముద్ర మారాలి. కానీ, అవేమీ లేని విశాఖ జస్ట్ జగన్ ఈగో శాటిస్ఫాక్షన్ రాజధాని మాత్రమే.