అమరావతిపై అలా.. మెడికల్ కాలేజీలపై ఇలా.. ఏందిది జగన్?!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో  ఐదేళ్లు అధికారంలో  ఉన్న జ‌గ‌న్  తాను సాధించిన అతి గొప్ప విజయంగా 17 కాలేజీలు నిర్మించానని తన భుజాలు తానే చరిచేసుకుంటూ ఉంటారు. ఆయన పార్టీకి కూడా చెప్పుకునేందుకు ఇది తప్ప మరొకటి కనిపించని పరిస్థితి ఉంది. అయితే వాస్తవం ఉమిటంటే.. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదు. మహా అయితే ఓ   ఐదు కాలేజీల నిర్మాణం పూర్తయి ఉంటుంది. అలా పూర్తయిన కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో పని చేయడం లేదు.  ఇక మిగిలిన కాలేజీల విషయానికి వస్తే భూ కేటాయింపులైతే జరిగాయి కానీ, నిర్మాణ పనులు ఆరంభం కాలేదు. కొన్ని కాలేజీలకు పునాదులు మాత్రమే పడ్డాయి. అంతే. ఐతే వైసీపీ మాత్రం 17 కాలేజీల నిర్మాణం తమ హయాంలో పూర్తయ్యిందని గప్పాలు కొట్టేసుకుంటున్నది. ఇదే విషయాన్ని జగన్ బుధవారం (సెప్టెంబర్ 10) మీడియా సమావేశంలో తన హయాంలో 17 కాలేజీల నిర్మాణం పూర్తయ్యిందని మరోమారు చెప్పుకుని, తన భుజం తానే చరుచుకుని చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. సరే జగన్ విమర్శలకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారనుకోండి అది వేరు సంగతి.

ఇప్పుడు విషయానికి వస్తే జగన్ ను మీడియా ప్రతినిథులు కాలేజీల నిర్మాణం పూర్తి కాలేదుగా అని అడిగితే.. జగన్ ఏ నిర్మాణమైనా ఒక్క రోజులో పూర్తి కాదు.. కొన్నేళ్ల సమయం పడుతుందంటూ జవాబిచ్చారు. ఇందుకు ఉదాహరణగా మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టిందంటూ ఉదాహరణ చూపారు. మంగళగిరి ఎయిమ్స్ భారీ భవన సముదాయం. నిర్మాణానికి సమయం పట్టిందంటూ అర్ధం ఉంది. దానిని ఉదాహరణగా చూపుతూ మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూడా సమయం పడుతుందంటూ జగన్ సమర్ధించుకోవాలని చూశారు. ఆయన సమర్ధింపు ఎలా ఉందంటే.. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఐదేళ్ల సమయం సరిపోదన్నట్లుగా ఉంది.  ఈ లాజిక్ తో మీడియా నోరు మూసేశానని జగన్ సంబరపడి ఉండొచ్చు కానీ  2015లో అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఖ‌రార‌య్యాక త‌ర్వాతి నాలుగేళ్ల‌లో రాజ‌ధాని పూర్తి కాలేదంటూ అప్పట్లో జగన్ కురిపించిన విమర్శల మాటేంటన్న ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెబుతారు.

 40 వేల కోట్ల‌కు పైగా వ్యయంతో పలు భారీ భవనాలు దాదాపు పూర్తి అయినా అప్పట్లో అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఏం లేదంటూ చేసిన వ్యాఖ్యల సంగతేంటని నెటిజనులు ఓ రేంజ్ లో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఐదేళ్లు  ఎలా సరిపోతాయంటూ తర్కం మాట్లాడుతున్న జగన్.. అమరావతిపై నిర్మాణాలపై అప్పట్లో చేసిన వ్యాఖ్యలు, విమర్శలకు ఏం లాజిక్ చెబుతారని నిలదీస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu