పింక్ డైమండ్.. దర్యాప్తు నివేదిక ఏం తేల్చిందో తెలుసా?

తిరుమల పింక్ డైమండ్ వివాదానికి దర్యాప్తు నివేదిక ఫుల్ స్టాప్ పెట్టేసింది. మునిరత్నం రెడ్డి నేతృత్వంలో ఆర్కియిలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ విషయంలో అసలు పింక్ డైమెండే లేదని విస్పష్టంగా తేల్చేసింది. మైసూర్ మహారాజు వెంకటేశ్వరుడికి సమర్పించిన నెక్లెస్‌లో ని పింక్ డైమెండ్ మాయం అయ్యిందంటూ 2018లో అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన పూజారి రమణదీక్షితులు ఆరోపించిన సంగతి తెలిసిందే.  ఆయన అప్పట్లో పింక్ డైమండ్ ను రహస్యంగా విదేశాలకు తరలించేశారని కూడా ఆరోపించారు.

ఆయన ఆరోపణలు అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. భక్తులు సైతం శ్రీవారి ఆభరణాలకే భద్రత లేదా అన్న ఆందోళణ వ్యక్తం చేశారు. అప్పట్లో వైసీపీ అప్పటి అధికార తెలుగుదేశం ప్రభుత్వంపై ఈ విషయంలో తీవ్ర ఆరోపణలు చేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా ఆరోపణలు, విమర్శలు గుప్పించింది.  అయితే నాడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధాలని ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చేసింది.  మైసూరు మహారాజా తిరుమల వేంకటేశ్వరుడికి సమర్పించిన నెక్లస్ లో పింక్ డైమండ్ లేనే లేదనీ, ఉన్నదల్లా కెంపులూ, రాళ్లేనని స్పష్టం చేసింది.

తమ దర్యాప్తులో భాగంగా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మైసూర్ ప్యాలెస్ రికార్డులను పరిశీలించింది. అలాగే మైసూర్ మహారాణి ప్రమోదాదేవినీ సంప్రదించింది. ఆ తరువాత ఆ నెక్లస్ లో అసలు పింక్ డైమండే లేదని నిర్ధారించి, ఆ మేరకు నివేదిక సమర్పించింది.  అంతే కాకుండా 2001లో గరుడ సేవ సందర్భంగా భక్తులు విసిరిన నాణేల కారణంగా నెక్లస్ లోని కెంపు దెబ్బతిని విరిగి ముక్కలైందనీ, ఆ విషయం అప్పట్లో అధికారికంగా నమోదైందనీ దర్యాప్తు నివేదిక పేర్కొంది. దాని ఆధారంతో పింక్ డైమండ్ అంటూ తప్పుడు ప్రచారం జరిగిందని స్పష్టం చేసింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu