అమరావతి రైతుల చలో అరసవల్లి

అమరావతి రైతులు.. మళ్లీ అరసవల్లి యాత్రకు బయలుదేరనున్నారు.  శనివారం (ఏప్రిల్ 1 ప్రత్యేక బస్సుల్లో రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు అరసవల్లికి బయలుదేరుతున్నారు.  ఆ క్రమంలో రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన పాదయాత్రలో వెంట తీసుకు వెళ్లిన శ్రీవారి రథానికి  ప్రత్యేక పూజలు   నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా రాజధాని రైతులు సింహాచలం, అన్నవరం, శ్రీకూర్మం, చిన్న తిరుపతి ఆలయాలను కూడా దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకోనున్నారు. 

 వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించడం.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు చేపట్టిన నిరసనలు, ఆందోళనలు.. రేపటికి1200వ రోజుకు చేరుకుంటాయి.  అమరావతి రైతులు.. గత ఏడాది సెప్టెంబర్ 13న అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టారు. ఆ క్రమంలో అక్టోబరు 20వ తేదీ వరకు చెదురుమదురు ఘటనలు మినహా పాదయాత్ర సజావుగానే కొనసాగింది. కానీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం  పసలపూడి వద్ద రైతులు చేస్తున్న  పాదయాత్రను పోలీసులు అడ్డుకొని... గుర్తింపు కార్డులు ఉన్నవారు మాత్రమే ఈ యాత్రలో పాల్గొన్నాలని సూచించారు.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం హైకోర్టులో తేల్చుకుంటామంటూ రాజధాని రైతులు ..  పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. దాంతో ఈ పాదయాత్రపై అటు ప్రభుత్వం, ఇటు అమరావతి రైతులు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే రైతుల చేపట్టిన పాదయాత్రను నిలిపి వేసేందుకు హైకోర్టు నిరాకరించింది. 

కానీ ఈ పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని సూచించింది. గుర్తింపు కార్డులు కచ్చితంగా కలిగి ఉండాలని.. అలాగే రైతులు చేపట్టిన పాదయాత్రకు ఏ రూపంలోనైనా సంఘీభావం తెలపవచ్చని స్పష్టం చేసింది. అయితే ఈ షరతులను ఏ మాత్రం ఉల్లంఘించరాదంటూ రైతులకు సూచించింది. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తామని రైతులు ప్రకటించినా... అది ఎందుకో కుదరలేదు. 

అయితే ఈ ఏడాది జనవరిలో అమరావతి జేఏసీ నేత గద్దె తిరుపతిరావు.. ఈ పాదయాత్ర నిలిచిపోయిన రామచంద్రాపురం నియోజకవర్గంలోని పసలపూడి నుంచి తిరిగి పాదయాత్ర చేపట్టి.. అరసవల్లి చేరుకుని.. స్వామి వారిని దర్శించుకొని   పాదయాత్ర పూర్తి చేశారు.  

మరోవైపు ఇదే రాజధాని రైతులు గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పుడు కూడా జగన్ ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే.. రైతులు హైకోర్టుకు వెళ్లి..   అనుమతులు తెచ్చుకొన్నారు. పాదయాత్ర పూర్తి చేశారు. అనంతరం తిరుపతిలో భారీ బహిరంగ సభను  నిర్వహించారు. అయితే మూడు రాజధానులకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసనలు, ఆందోళనలు, పాదయాత్రలకు అధికార వైసీపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.