జగన్ గూటిలోకి మోపిదేవి ?
posted on Dec 1, 2012 10:38AM

మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణా రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కనిపిస్తోంది. జగన్ పార్టీకి చెందిన మాచర్ల ఎం ఎల్ ఏ పిన్నెల్లి రామ కృష్ణా రెడ్డి నిన్న మోపిదేవి ని చంచల్ గూడ జైలులో కలవడమే ఈ వదంతికి కారణం. తామిద్దరం మంచి మిత్రులమని అందుకే మోపిదేవి ని కలిశాను తప్ప ఇందులో రాజకీయ కారణమేదీ లేదని పిన్నెల్లి అన్నారు. అయితే, తమ పార్టీలోకి ఆహ్వానించెందుకే పిన్నెల్లి మోపిదేవి కలిసారనే ప్రచారం జరుగుతోంది.
అయితే, కాంగ్రెస్ పార్టీ తనను పక్కన పెట్టిందని మోపిదేవి ఇప్పటికే ఆవేదనతో ఉన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా మోపిదేవి కేసు వేరు, ధర్మాన కేసు వేరు అని వ్యాఖ్యానించడం పట్ల మోపిదేవి ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభ్యునిగా, మంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తనను పార్టీ చిన్న చూపు చూడడం మోపిదేవి ఆగ్రహానికి గల కారణం. తాను జైలు నుండి బయటకు వచ్చినప్పటికీ, పార్టీలో తనకు తగిన గుర్తింపు లభిస్తోందా అనే విషయంలో మోపిదేవికి బలమైన సందేహాలే ఉన్నాయి.
ఈ పరిణామాల వల్ల జగన్ పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో రేపల్లె నుండి పోటీ చేయాలని మోపిదేవి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.