జగన్ అందుకే ప్రధాని అపాయింట్మెంట్ కోరారుట!
posted on Oct 20, 2015 7:59AM
.jpg)
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోరడాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తప్పు పట్టారు. ఈ చారిత్రిక కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, ప్రధానిని కూడా తప్పుదోవ పట్టించేందుకే అపాయింట్మెంట్ కోరుతున్నారని పుల్లారావు అభిప్రాయపడ్డారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొని ఉన్న చక్కటి బలమయిన సంబంధాలును జగన్మోహన్ రెడ్డి చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తద్వారా రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం సహకారం లేకుండా చేద్దామని జగన్ ప్రయత్నిస్తున్నారని పుల్లారావు ఆరోపించారు. జగన్ తన స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకొనేందుకు కూడా సిద్దపడటం చాలా శోచనీయమని పుల్లారావు అన్నారు. అయితే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న జగన్ మాటలను ప్రధానే కాదు ఎవరూ నమ్మరని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చుపెట్టాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎన్నటికీ సఫలం కావని అన్నారు.