ఆంద్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు కూడా శంఖుస్థాపనకి డుమ్మా?
posted on Oct 20, 2015 2:26PM
.jpg)
ఆంద్రప్రదేశ్ ప్రజల అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. ఎన్నికలకు ముందే అనేకమంది వేరే పార్టీలలోకి వెళ్ళిపోగా, మిగిలినవారిలో కొందరు ఎన్నికల తరువాత వెళ్ళిపోయారు. ఇంకా మిగిలిన వారిలో చాలా మంది ప్రజలకు మొహాలు చూపించి చాలా కాలం అయ్యింది. ప్రత్యేక హోదా అంశాన్ని భుజానికెత్తుకొని కాంగ్రెస్ ఎన్ని పోరాటాలు చేసినా ప్రజలు వారిని పట్టించుకోవడం మానేశారు. ఈ విషయం ఎవరో చెప్పలేదు. ఆ పార్టీని వీడుతున్నవారే స్వయంగా చెపుతున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకొంది. తమను సరిగ్గా ఆహ్వానించనందునే ఈ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించుకొన్నామని మాజీ మంత్రి శైలజానాథ్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు తన ఇంట్లో కార్యక్రమంలాగ నిర్వహిస్తున్నారని విమర్శించారు. అయితే తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని తెలిపారు. తాము ప్రధాని నరేంద్ర మోడీని అపాయింట్మెంట్ కోరినప్పటికీ ఆయన తమను పట్టించుకాలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రజల దృష్టిలో చాలా చులకనయ్యారు. ఇప్పుడు ఈ రాష్ట్ర కార్యక్రమానికి ఏవో కుంటిసాకులు చెప్పి వెళ్ళకుండా తప్పించుకొన్నట్లయితే వారిపట్ల ప్రజలలో మరింత ఏహ్యత పెరుగవచ్చును. వారు రాష్ట్రానికి సంబందించిన ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేసినట్లయితే, వారికి ఈ రాష్ట్రం పట్ల అభిమానం కంటే తమ పార్టీ ప్రయోజనాలే మిన్న అనే దురాభిప్రాయం ప్రజలలో కల్పించినట్లువుతుంది. ఈ కార్యక్రమానికి తను పిలిచినా రానని ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో తెలుసుకొనే ప్రయత్నం చేసి ఉంటే కాంగ్రెస్ నేతలు ఇటువంటి నిర్ణయం తీసుకొనేవారు కాదు. ఒకవేళ తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయి, ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకాకపోతే అప్పుడు ప్రజలు వారి గురించి ఏమనుకొంటారో తేలికగానే ఊహించుకోవచ్చును. కనుక రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దీనిపై బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది.