వైకాపాకి అంత ఓవర్ యాక్షన్ ఎందుకో?

 

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, కార్యకర్తలు కలిసి సోమవారం డిల్లీలో జంతర్ మంతర్ వద్ద రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ ధర్నా చేసారు. ఆ తరువాత వారందరూ కలిసి అక్కడి నుండి పార్లమెంటుకి పాదయాత్రగా బయలుదేరారు. పార్లమెంటు సమీపంలో వారిని భద్రతా దళాలు, పోలీసులు అడ్డుకొన్నప్పటికీ వారు ముందుకు సాగే ప్రయత్నం చేయడంతో జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీ నేతలు కొందరిని పోలీసులు అరెస్ట్ చేసారు. మళ్ళీ సాయంత్రం వారందరినీ విడుదల చేసారు. పోలీసులు తమని అరెస్ట్ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులు తప్పు పట్టారు. ప్రజాస్వామ్యబద్దంగా తాము పాదయాత్ర చేసి పార్లమెంటు వద్దకు వెళ్లానుకొంటే తమపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వారు విమర్శించారు.

 

ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున చాలా కట్టుదిట్టమయిన భద్రత వలయం ఏర్పాటు చేయబడి ఉంటుంది. కనుక జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలని వెంటపెట్టుకొని ఆ భద్రతా వలయాన్ని చేధించుకొని వెళ్లానుకోవడమే చాలా తప్పు. ఒకప్పుడు ఎంపీగా చేసిన జగన్మోహన్ రెడ్డికి ఆ విషయం తెలియదనుకోలేము. పార్లమెంటులో సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వాటికి భంగం కలిగించకుండా తన పార్టీ నేతలని నియంత్రించవలసింది పోయి ఆయనే స్వయంగా అందరినీ వెంటేసుకొని ముందుకు వెళ్ళడం మరో తప్పు.

 

నిజానికి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించలేదు. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నప్పుడు పోలీసులు వారిని అరెస్ట్ చేయలేదు. భద్రతా వలయాన్ని చేధించుకొని ముందుకు సాగి వారే అత్యుత్సాహం ప్రదర్శించారు. అప్పుడే పోలీసులు అరెస్ట్ చేయవలసి వచ్చింది. పార్లమెంటు చుట్టూ ఏర్పాటు చేయబడిన భద్రతా వలయాన్ని చేదించుకొని ముందుకు సాగితే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డికి, అతని అనుచరులకు తెలియదనుకోలేము. కానీ రాష్ట్రంలో ప్రజల దృష్టిని, జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాలనే తాపత్రయంతో అరెస్టుకు సిద్దపడే వారు ముందుకు వెళ్ళారు. బహుశః తమను పోలీసులు అరెస్ట్ చేసినందుకు కూడా రాష్ట్రంలో ప్రజల సానుభూతి పొందాలనుకొంటున్నారేమో?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu