రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వంత ప్రయోజనాలే ముఖ్యమా?

 

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన పట్టిసీమ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన చేస్తున్నప్పుడే దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జగన్మోహన్ రెడ్డి డిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి పిర్యాదు చేసారు. ఆ తరువాత ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి ఆయనకు కూడా ఈ పట్టిసీమ ప్రాజెక్టు గురించి పిర్యాదు చేసారుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఏదో విధంగా నిధులు రాబట్టేందుకు గట్టిగా కృషి చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి పనిగట్టుకొని డిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై పిర్యాదులు చేస్తున్నారు. కేంద్రం విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా దుర్వినియోగం చేస్తోందని జగన్మోహన్ రెడ్డి కేంద్రప్రభుత్వానికి నచ్చజెప్పుతున్నట్లుంది. ఒకవేళ ప్రధానమంత్రి, ఆర్ధికమంత్రి జగన్మోహన్ రెడ్డి చెపుతున్న మాటలు నమ్మి రాష్ట్రానికి విడుదల కావలసిన నిధులలో కోత పెట్టినట్లయితే రాష్ట్రానికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంది.

 

జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ శత్రువు తెదేపాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని దెబ్బతీసేందుకు ఈవిధంగా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం చాలా తప్పు. ఒకవేళ పట్టిసీమ ప్రాజెక్టు వలన రాష్ట్రానికి నష్టం కలుగుతుందని ఆయన దృడంగా విశ్వసిస్తున్నట్లయితే దానిని అడ్డుకొనేందుకు ఆయన కోర్టులను ఆశ్రయించవచ్చును. ఈ అంశంతో కూడా ఆయన తన పార్టీకి రాజకీయ లబ్ది కలగాలని భావిస్తే అందుకోసం రాష్ట్రంలో ధర్నాలు, ర్యాలీలు చేసుకోవచ్చును. కానీ ఈవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై, అది చేపడుతున్న ప్రాజెక్టులపై డిల్లీ వెళ్లి కేంద్రానికి పిర్యాదులు చేయడం వలన రాష్ట్రానికి తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంది.

 

ఇంతకు ముందు పంట రుణాల మాఫీపై ధర్నాలు, మహాధర్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ తరువాత రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేసారు. కానీ ఇప్పుడు ఆయన వాటి గురించి మాట్లాడటం లేదు. ఎందుకంటే వాటి వలన ఇక తన పార్టీకి ఎటువంటి రాజకీయ లబ్ది కలగదని గ్రహించడం వలన కావచ్చును. అందుకే ఆయన ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టును పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారు. బహుశః దీని తరువాత మరొక సరికొత్త అంశం ఏదో అందిపుచ్చుకొని హడావుడి చేయవచ్చును. కానీ ఆయన తన పార్టీ ప్రయోజనాల కోసం, రాజకీయ కక్షల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టాలనుకొంటే మాత్రం ప్రజలు సహించబోరనే సంగతి గ్రహించాలి.