పార్టీపై జగన్ పట్టు జారిపోయిందా?

వైసీపీ బండారం బయటపడిపోయింది.  పార్టీపై జగన్  పూర్తిగా పట్టు కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో నే అది పక్కాగా తేటతెల్లమైపోయింది. మూడేళ్ల పాటు గుప్పిట మూసి అంతా నేనే.. నా మాటే శాసనం అన్నట్లుగా ఇచ్చిన బిల్డప్ ఒక్క సారి మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించడంతో కుప్పకూలిపోయినట్లైంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తరువాత ఎమ్మెల్యేలూ, మంత్రిపదవుల ఆశావహులూ, పదవి కోల్పోయిన మాజీలలో వెల్లువెత్తిన నిరసన వైసీపీ బండారాన్ని బయటపెట్టేశాయి. సరే ఆ అసంతృప్తి ఎలాగో కష్టపడి బుజ్జగింపుల ద్వారా చల్లార్చుకున్నారనుకుంటే అసలు సినిమా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంతో మొదలైంది. ఈ కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లిన మంత్రులకు అడుగడుగునా ప్రజా నిరసన సెగలా తగలడంతో  దానిని తూతూ మంత్రంగా చుట్టేయడానికే ఎమ్మెల్యేలూ, మంత్రులూ మొగ్గు చూపారు. దీంతో జగన్ సమీక్ష నిర్వహించారు.

కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల పేరు ప్రస్తావించి మరీ తీవ్ర హెచ్చరికలు చేశారు. టికెట్లు, పదవులు అన్నీ కూడా గడపగడపకూ పెర్ఫార్మెన్స్ పైనే ఆధారపడి ఉంటాయన్న హెచ్చరికలు జారీ చేశారు. మంత్రివర్గాన్ని మరోసారి పునర్వ్యవస్థీకరించి పెర్ఫార్మెన్స్ బాలేని మంత్రులకు ఉద్వాసన పలుకుతాననీ, బాగున్న వారికి పదవులు కట్టబెడతాననీ విస్పష్టంగా చెప్పేశారు. ఇది జరిగిన నెలల వ్యవధిలోనే మరో సారి సమీక్ష నిర్వహించారు. అప్పుడూ అదే ధోరణి కానీ ఫలితం మాత్రం కనిపించలేదు. ఈ సందర్భంగానే మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనీ పలువురి మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదనీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సరే ఆ చర్చ అలా జరుగుతుండగానే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఫలితాలు వెలువడ్డాయి. వైసీపీకి ఆ ఎన్నికలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి. మూడు గ్యాడ్యుయెట్ ఎమ్మెల్సీ స్థానాలలోనూ, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలోనూ అధికార వైసీపీ ఘోర పరాభవం చవి చూసింది. ఇక ఆ తరువాత నుంచీ జగన్ నోటి వెంట హెచ్చరికలు లేవు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షలు లేవు. రుసరుసలు లేవు. మొత్తం బుజ్జగింపుల పర్వమే.

పనితీరు బాలేకపోతే వచ్చే ఎన్నికలలో నో టికెట్ అంటూ హెచ్చరికలు లేవు.  ఎమ్మెల్యేలలో అసంతృప్తి, ధిక్కారం అన్నీ విపక్షాల సృష్టే అంటూ గతంలో మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా జగన్ స్వరం మారిపోయింది.   ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి బహిష్కరించారు. అప్పట్లోనే ఇంకా పలువురు లిస్ట్ లో ఉన్నారంటూ గంభీరమైన లీకులు ఇచ్చారు. అయితే ఆ తరువాత సీన్ మారిపోయింది. ఏప్రిల్ 3న నిర్వహించిన సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టినా కిమ్మనలేదు.  అప్పటి వరకూ ఓ హెచ్చరికలా చెబుతూ వచ్చిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాట ఎత్తలేదు.

గత ఏడాది సెప్టెంబర్‌లో ముగ్గురు మంత్రులకు ఉద్వాసన చెప్పబోతున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ వర్గాలు మీడియాకు స్పష్టమైన లీక్‌లు ఇచ్చాయి. అప్పట్లో కేబినెట్ సమావేశంలో  స్వయంగా జగన్   ఇద్దరు, ముగ్గురు మంత్రుల్ని మార్చేస్తానని హెచ్చరించారు.  అయితే తరువాత పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాట కాదు కదా.. కనీసం పని చేయని మంత్రులను మందలించే ధైర్యం కూడా చేయలేనంత బలహీనంగా సీఎం మారిపోయారు. గతంలోలా సొంత పార్టీపై పట్టు లేకపోవడం వల్లనే ఆయన పార్టీ కార్యక్రమమైనా, ప్రభుత్వ కార్యక్రమమైనా విపక్షంపై విమర్శలు చేయడానికే అన్నట్లుగా జగన్ అజెండా మారిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.