కేసీఆర్ తీరుతో బీజేపీలో ఆందోళన!

తెలంగాణలో బీజేపీ పరిస్థితి దిగజారిపోయిందా? ఇందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావేనా? అంటే కమలనాథులు ఔననే అంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి హైప్ ఇచ్చిందీ, ఇప్పుడా హైప్ ను తగ్గించేసి పార్టీని మళ్లీ మొదటికి తీసుకువచ్చిందీ కూడా కేసీఆరే అని అంటున్నారు. కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ కు స్థానం లేకుండా చేయాలన్న ఉద్దేశంతో బీజేపీకి లేని హైప్ ను క్రియేట్ చేశారని పరిశీలకులు అంటున్నారు.

అయితే  అలా చేయడం వల్ల రాష్ట్రంలో బీజేపీ పెరిగేదీ ఉండదు.. ఆ పార్టీకి ఒరిగేదీ ఏమీ ఉండదని ఆయన భావించారంటున్నారు. కానీ తర వైఖరి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకు పోతుందని ఆయన భావించారు. చాలా వరకూ ఆయన అనుకున్నట్లే జరిగింది కానీ, కేసీఆర్ కృత్రిమంగా బీజేపీకి క్రియేట్ చేసిన హైప్ ఆసరాగా తీసుకుని ఆ పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు (గతంలో టీఆర్ఎస్)కు దీటుగా ఎదిగింది. ఆయన రాష్ట్రంలో బీజేపీకి ఉద్దేశపూర్వకంగా హైప్ క్రియోట్ చేయడానికి కాంగ్రెస్ ను బలహీన పరచడమే కాకుండా తన జాతీయ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి కూడా దోహదపడుతుందని భావించారు. అయితే కేసీఆర్ వ్యూహాలు ఆ విషయంలో పెద్దగా ఫలించలేదు. అంతే కాకుండా ఆయన బీజేపీ వ్యతిరేకత బూమరాంగ్ కూడా అయ్యింది.

ఆయన పదే పదే కేంద్రంలోని మోడీ సర్కార్ ను, రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని విమర్శించడంతో.. రాష్ట్రంలో కమలం బలోపేతమైంది. బీఆర్ఎస్ ను గట్టిగా ఢీ కొనే స్థాయికి చేరింది. అదే సమయంలో ఆయన బీజేపీ వ్యతిరేక వైఖరిని తీసుకోవడాన్ని జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలు నమ్మలేదు. అందుకే ఆయన కాంగ్రెస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ అంటూ చెప్పులరిగేలా దేశమంతా తిరిగినా ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆయన ఇక లాభం లేదనుకుని సొంతంగా జాతీయ పార్టీని ప్రారంభించేశారు.

అందుకు ఇంత కాలం తనకు అండగా, తన అధికారానికి దండగా నిలిచిన తెలంగాణ సెంటిమెంటును కూడా వదిలేసుకున్నారు. పార్టీలోని తెలంగాణ పేరును తీసేసి తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్తా భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఇలా చేయడం వల్ల ఆయనకు ఒరిగిన అదనపు ప్రయోజనం ఏమీ లేదు కానీ ఇక ఏ ఎన్నికలోనూ ఆయన తెలంగాణ సెంటిమెంట్ ను అస్త్రంగా తీసుకునే అవకాశాన్ని మాత్రం కోల్పోయారు. అదే సమయంలో రాష్ట్రంలో కేసీఆర్ తీరు వల్లే బలోపేతమైన బీజేపీ రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టగలమనుకునే స్థాయికి ఎదిగింది. సరిగ్గా ఇక్కడే కేసీఆర్ తన పొరపాటును గుర్తించారు. అంతే వ్యూహాత్మకంగా తన ప్రసంగాలలో బీజేపీ పేరెత్తడం మానేశారు. దీని వల్ల గతంలో  అంటే టీఆర్ఎస్ గా ఉన్న సమయంలో ఆయన బీజేపీకి అన్ని విధాలుగా అండగా నిలబడిన విషయాన్ని గుర్తు చేస్తూ పరిశీలకులు మొదటి నుంచీ కేసీఆర్ బీజేపీ బీటీమ్ గానే వ్యవహరించారంటూ విశ్లేషణలు చేస్తున్నారు.

అదే సమయంలో  రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకునేందుకు కేంద్రంలో బీజేపీకి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొనేందుకు కూడా  కేసీఆర్ వెరవ లేదు. అయితే.. ఇప్పుడు బీజేపీకి ఇంకా ప్రాధాన్యత ఇస్తూ పోతే.. రాష్ట్రంలో తన అధికారానికే ముప్పు వస్తుందన్న భావనకు వచ్చిన కేసీఆర్ బీజేపీ పేరెత్తడం మానేశారు. ఇదే బీజేపీకి తెలంగాణలో మైనస్ అయ్యింది. కర్నాటక ఫలితాలతో దిగాలు పడిన బీజేపీకి కేసీఆర్ మారిన వైఖరి మరింత ఇబ్బందికరంగా మారింది. దీనికి తోడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడానికి కారణమైన బీజేపీ, మోడీ వ్యతిరేకతకు కేసీఆర్ నీళ్లొదిలేశారన్న ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా ఆయన బీజేపీయేతర పార్టీల సీఎంల భేటీకి దూరంగా ఉండటంతో  కేసీఆర్ బీజేపీల మధ్య రహస్య మైత్రి ఉందన్న భావన బలపడుతోంది. సరిగ్గా ఇదే తెలంగాణలో బీజేపీని బలహీన పరుస్తోంది. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకత బీజేపీపై కూడా ప్రతిఫలిస్తుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అది అంతిమంగా  కాంగ్రెస్ కే ప్రయోజనం చూకూరుస్తుందని బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.