పట్టాలెక్కిన జ్ణాన బుద్ధ ప్రాజెక్టు!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పురోగతి శరవేగంగా సాగుతోంది. గతంలో అంటే జగన్ హయాంలో ఆగిపోయిన కీలక ప్రాజెక్టులను ప్రభుత్వం తిరిగి పట్టాలెక్కిస్తోంది. అందులో భాగంగానే జ్ణాన బుద్ధ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుకు రెండు కోట్ల రూపాయలు విడుదల చేయడంతో జ్ణానబుద్ధ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోనున్నాయి. 

  2014 నుంచి 2019 మధ్య అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ‘జ్ఞాన బుద్ధ’ పేరుతో భారీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఇందులో బౌద్ధ ఆరామానికి సంబంధించిన అనేక విశేషాలతో పాటు బుద్ధుని భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనీ, చుట్టూ హరిత హారాన్ని నిర్మించాలని ప్రణాళిక రూపొందించింది.ఈ ప్రాజెక్టు ద్వారా ప్రపంచ స్థాయి బౌద్ధులను ఆకర్షించే అవకాశాలుంటాయని భావించిన చంద్రబాబు ప్రభుత్వం అప్పట్లోనే ఈ ప్రాజెక్టుకు ఐదెకరాల భూమిని కూడా కేటాయించింది. ప్రస్తుతం అక్కడ ఉన్న నూటపాతిక అడుగుల ఎత్తైన  బుద్ధుని విగ్రహ నిర్మాణం కూడా ఇందులో భాగమే.  అయితే ఆ తరువాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ రాజధాని అమరావతిని పక్కన పెట్టేసి మూడు రాజధానుల విధానమంటూ.. ఈ ప్రాజెక్టును కూడా మూలన పడేసింది.  

ఇప్పుడు మళ్లీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ పట్టాలెక్కింది. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుకు సంబంధించి విధివిధానాలను పర్యటక శాఖ రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం తాజాగా జ్ఞాన బుద్ధ ప్రాజెక్టుకు నిధులు కేటాయిం చింది.  ప్రత్యేక ధ్యాన మందిరం, గ్రంథాలయం, బౌద్ధుని స్మృతులతో కూడిన ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేసి జ్ణాన బుద్ధను   పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు పూర్తైతే ఏటా లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తారన్నది అంచనా. ఆ అంచనాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu