కవితక్క కొత్త పార్టీకి.. పీకే ఐడియాలజీ?
posted on Jan 20, 2026 2:07PM

సొంత రాష్ట్రంలో సొంతంగా పార్టీ పెట్టి దానిని ఎన్నికలలో గెలుపు బాటలో నడిపించలేక చతికిలపడి, ఇప్పుడా పార్టీని ఎలా నడపాలో తెలియక అయోమయంలో ఉన్న ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్న కల్వకుంట్ల కవితకు ఐడియాలజిస్టుగా ఉంటారట. సొంతంగా పార్టీని నడపడంలో విఫలమైన ప్రశాంత కిషోర్ ఐడియాలు, వ్యూహాలు కవిత పార్టీకి ఏ మేరకు పని చేస్తాయి? ఏ మేరకు పనికొస్తాయి అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. సరే అసలు తాను కవిత పార్టీకి వ్యూహకర్తగా పని చేయనున్నానంటూ వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధాలని ప్రశాంత్ కిశోర్ కొట్టి పారేశారనుకోండి అది వేరు సంగతి. ఇటీవల కవిత- ప్రశాంత్ కిషోర్ మధ్య రెండు సమావేశాలు జరిగాయనీ, కవిత తన పొలిటికల్ స్ట్రాటజిస్టుగా ఆయన్ను నియమించుకునే అవకాశం కనిపిస్తోందన్న వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రశాంత్ కిశోర్ ఖండించినప్పటికీ చర్చ మాత్రం ఆగడం లేదు.
ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో సోదిలో కూడా కనిపించలేదు. ఇక ఆయన స్వయంగా పార్టీ అభ్యర్థిగా ఎక్కడా పోటీ చేయలేదు. స్వతహాగా బీహారీ అయిన ప్రశాంత్ కిషోర్ .. సాటి బీహారీ అయిన కవితకు.. (ఈ కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కేసీఆర్ కుటుంబం కూడా బీహార్ నుంచే ఏపీలోని బొబ్బిలికి వలస వచ్చినట్టు చెబుతారు. ఆ తర్వాతే వారు తెలంగాణకొచ్చి సెటిలైనట్టు అంటారు. అందుకే కేసీఆర్ గతంలో బీహార్ లో కొందరికి ఆర్ధిక సాయం చేశారు కూడా) రాజకీయ సలహాదారుగా పని చేయడానికి ముందుకు వచ్చారన్న చర్చ జరుగుతోంది. సొంతంగా పార్టీ పెట్టడానికి ముందు వరకూ ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు బాగానే క్లిక్ అయ్యాయి. ఏపీలో జగన్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, అంతకంటే ముందు 2014లో కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ వ్యాహాలే కారణమనే వారూ లేకపోలేదు. కానీ ఇంటి వైద్యం ఒంటపట్టదన్నట్లు ఆయన వ్యూహాలు ఆయన సొంత పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడలేదు. సరే అది పక్కన పెట్టి పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలలో సెంటిమెంట్ ప్రధానం అన్నది తెలిసిందే.
మొన్నా మధ్య కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ.. తాను ఆస్తి కోసం పోరాడ్డం లేదని ఆత్మగౌరవం కోసం కొట్లాడుతున్నానని ప్రకటించడమే కాకుండా.. కన్నీటి పర్యంతరం అయ్యారు. ఒక మహిళ ఇంత పెద్ద ఎత్తున ఒక నిండు సభలో కన్నీటి పర్యంతం కావడం ఏమంత చిన్న విషయం కాదు. ఈ విజువల్ పబ్లిక్ లోకి బలంగా వెడుతుంది. సెంటిమెంట్ రగులుస్తుంది. ఆ సెంటిమెంట్ నే కవిత తెలంగాణ రాజకీయాల్లో రాణించేందుకు మరింత రగిల్చేలా పీకే వ్యూహాలకు పదును పెట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక మహిళా రిజర్వేషన్లు. బీసీల కోసం కొట్లాట ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ అంబుల పొదిలోని ఆస్త్రాలుగానే చెబుతున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్ కేసీఆర్ తో జత కట్టి ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన చేస్తారనే ప్రచారం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ అప్పట్లో జాతీయ రాజకీయాల వైపునకు వెళ్లే ఆలోచన చేశారు. కానీ ఇదే కవిత అన్నట్టు ఇక్కడేం పీకినం అని దేశ రాజకీయాల్లోకి బోవాలె అన్నట్టు.. గులాబీ బాస్ ఎందుకో వెనకడుగు వేశారు. ఆపై అక్కడ మాట దేవుడెరుగు- ఇక్కడ కూడా కేసీఆర్ కార్ పార్టీ చతికిలపడ్డ సంగతి తెలిసిందే.
ఇప్పుడు కవిత వ్యూహాల వద్దకు వస్తే.. ప్రశాంత్ కిషోర్ సలహా సూచనలు ఎంత మేర వర్కవుట్ అవుతాయన్నది ప్రశ్నార్థకమే. నీటిలో ఉన్న బర్రెకు రేటు కట్టడం కష్టమేమోగానీ.. అది బయటకొచ్చాక దాని పొదుగు చూసి ఆ ధర ఇట్టే చెప్పొచ్చు అన్నట్టు.. ప్రశాంత్ కిషోర్ ఒక రాజకీయ అనామకుడు. అప్పట్లో మోడీకి, ఆ మధ్య జగన్ కి అతడిచ్చిన ఒకటీ అరా సలహా సూచలను అడ్డి మార్- గుడ్డి దెబ్బ లెక్క వర్కవుట్ అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఇప్పుడు కూడా ఆయన సలహా సూచనలు, భారీ మందీ మార్బలం, ఆపై అణువణువూ లెక్కలు తీసి వాటి ద్వారా ఏదో చేయాలన్న వ్యూహాలు.. ఇవన్నీ కూడా బెడిసి కొట్టి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడీ రాజకీయ వ్యూహాలకు బుట్టలో పడే ఓటరు మహాశయులెవరూ లేరు.కాబట్టి కవిత ఆయన వ్యూహాల కోసం అర్రులు చాచడం అనవసర మంటున్నారు పరిశీలకులు. కాదని ఒక వేళ కవిత ప్రశాంత్ కిశోర్ ను వ్యూహకర్తగా నియమించుకున్నా, ఆయనకు ఇచ్చే భారీ ఫీజు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతుందంటున్నారు. ఫైనల్ గా సీఎం దావోస్ పర్యటన శుద్ధ దండగ అంటున్న కవిత.. తాను ప్రశాంత్ కిషోర్ కి వెచ్చించే సొమ్ము కూడా బీహారార్పణం అవుతుందని గ్రహించాల్సి ఉంటుందంటున్నారు.