ఉద్యోగులతో యుద్ధమే.. పీకే వ్యూహమే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల‌కు పైగానే సమయముంది. ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి, ఇప్పటి నుంచే పావులు కదపడం ప్రారంభించారా? అందులో భాగంగానే రాష్ట్రంలో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారా? అందుకేనా, ప్రభుత్వ ఉద్యోగులతో  యుద్దానికి సిద్దమవుతున్నారా? అంటే అవుననే అంటున్నారు. 

నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించక పోవడం వల్లనే, ప్రభుత్వం ఉద్యోగుల పీఆర్సీ, ఇతర ఆర్థిక సంబంధ విషయాలలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేసింది అంటే, అందులో నిజం ఉన్నా లేకున్నా, కొంత వరకు అర్థం చేసుకోవచ్చును. అయితే అదే విషయాన్ని ఉద్యోగులతో చర్చించి, వారిని కూడా విశ్వాసంలోకి తీసుకుని తుదినిర్ణయం తీసుకుంటే అదో రకంగా ఉండేది. కానీ, అలాంటి ప్రయత్నం జరగలేదు. పైగా ఒక‌వంక చర్చలు అంటూనే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. 

నిజానికి ఇప్పుడు ప్రకటించిన పీఆర్సీ ఇప్పుడు ఇవ్వవలసింది కాదు. ఎప్పుడో ఇవ్వవలసింది. ఇవ్వలేదు. గత రెండున్నర మూడు సంవత్సరాలుగా 27 శాతం ఐఆర్ ఇచ్చి ప్రభుత్వం పీఆర్సీ వాయిదా వేస్తూ వచ్చినా ఉద్యోగులు కరోనా మహామ్మారి సృష్టించిన ఆర్ధిక,  అర్థికేతర సమస్యలను దృష్టిలో ఉంచుకునే, ‘పీఆర్సీ’,  ‘ఫిట్మెంట్’ కోసం పట్టు పట్టలేదు. 

అలాగే, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇవ్వవలసిన ఐదు  కరవు భత్యం కిస్తీలు ఆపినా ఉద్యోగులు ఆందోళనకు దిగలేదు. చివరకు ఉద్యోగులు అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్న సీపీఎస్ రద్దు హామీ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పినా, మడమ తిప్పినా ఉద్యోగులు తమ డిమాండ్’ను వినిపిస్తూ వచ్చారు కానీ, ఇచ్చిన మాట ఏమైందని ప్రభుత్వం కాలరు పట్టుకుని నిలదీయలేదు. 

ఇప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ (27 శాతం) కంటే ఫిట్మెంట్’ (23 శాతం) తక్కువ అయినా ఒపుకున్నారు . అయినా  హెచ్ఆర్ఏ ఇతర సమస్యల మీద చర్చలు జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం ఏక పక్షంగా రాత్రికి రాత్రి జీవోలు జారీ చేసి వివాదానికి శ్రీకారం చుట్టింది. అంతే కాకుండా, సర్కార్ తీసుకున్న చీకటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యోగుల సిద్ధమవుతున్న వేళ వారితో చర్చలకు ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. అయితే ఆ కమిటీతో ఉద్యోగ సంఘాల చర్చలు మొదలు కాకముందే అర్థరాత్రి జీవోలకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది.

సోమవారం సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్న సమయంలో మంత్రులు ఫోన్ చేసి, చర్చలకు రమ్మని నాయకులను పిలిచారు. అయితే, అదే సమయంలో కొత్త జీవోల  ప్రకారమే జనవరి నెల జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం మరో జీవో జారీచేసింది. అంటే, ఒక విధంగా ప్రభుత్వం ఉద్యోగులను అవమానపరిచి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందనే అనుమానాలకు ఆస్కారం కలిపిస్తోంది.   
అంతే కాదు, ప్రభుత్వం ఉద్యోగులతో యుద్దానికి కాలు దువ్వుతోందా అన్నట్లుగా, ఉద్యోగులకు వ్యతిరేకంగా వ్యూహాత్మక ప్రచారం ప్రారంభించింది. ఇందుకు వలంటీర్లతోపాటు సోషల్‌ మీడియానూ విస్తృతంగా వాడుకుంటోంది. ఉద్యోగులకు జీతాలు తగ్గవు. పెరుగుతాయి. వాళ్లు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజల్లోకి వెళ్లండి. మన వాదన వినిపించండి’ అని స్వయంగా ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి  మంత్రివర్గ సహచరులను ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఉద్యోగులు కోరినట్లుగా హెచ్‌ఆర్‌ఏ ఇస్తే, ఏదైనా పథకాన్ని ఆపాల్సి ఉంటుందని అందుకు ఈ ప్రభుత్వం  ఎప్పటికీ అంగీకరించదని స్వయంగా ముఖ్యమంత్రి అన్నట్లు వార్తలొచ్చాయి. అంటే, ఉద్యోగులను బూచిగా  చూపించి ప్రజలను, ముఖ్యంగా  పథకాల లబ్దిదారులను తమ వైపుకు తిప్పుకునేందుకు రాజకీయ కుట్ర పూరిత ఎత్తుగడను ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారని పరిశీలకులు అంటున్నారు. 

నిజానికి, ఒక్క విషయంలోనే కాదు, రాజదాని విషయంలో, సినిమా టికెట్ల వ్యవహారంలో, ఇతర విషయాల్లో కూడా సమాజంలోని వివిధ వర్గాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు కుట్ర జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా,ఈ  కుట్ర పూరిత ఎత్తుగడ వెనక ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉందనే అనుమానాలు కూడా వినవస్తున్నాయి.