కర్ర ఝుళిపిద్దామనుకున్నారు.. కాళ్లా వేళ్లా పడుతున్నారు.. సాక్షిని టార్గెట్ చేసిన జాక్

ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డిది అసలైన గాంభీర్యమా? మేకపోతు గాంభీర్యమా.. అనేది కొద్ది గంటల్లోనే తేలిపోయింది. ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టాల్సిందేనని, అలా గంట కట్టకపోతే ఎలుకల్ని కంట్రోల్ చేయడం అయ్యే పని కాదంటూ వీర లెవెల్లో బిల్డప్ లు ఇచ్చిన జగన్ సర్కారు.. ఆ జీవో జారీ చేసిన కొద్ది కాలానికే జ్ఞానోదయం పొందిందా.. లేక తత్వం బోధపడి నాలుక మడతేసిందా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటో నెంబర్ జీవో జారీ అయిన వెంటనే ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగం తప్పదన్న అభిప్రాయాలు వినిపించాయి. ఉద్యోగులు గనక విధులకు డుమ్మా కొడితే ప్రభుత్వ వ్యవహారాలు, ప్రజా సమస్యల పరిష్కారాలకు విఘాతం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవో చేయబోతున్నారన్న అభిప్రాయాలకూ ప్రభుత్వ పెద్దలు ఆస్కారం కలిగించారు. కానీ కొద్ది గంటల్లోపే.. పిల్లి మెడలో గంట కట్టి తీరతామన్న పెద్దలు కాస్తా స్వయంగా పిల్లులుగా మారిపోయిన సీన్ కళ్లకు కడుతోందిప్పుడు. 

పీఆర్సీసీని డిక్లేర్ చేస్తూ జీవో జారీ చేసిన వెంటనే ఏపీ ఉద్యోగ సంఘాల జాక్ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తాడోపేడో తేల్చుకుంటామన్న ఆ ఒక్క మాట తప్ప.. వారి ప్రకటనల్లో ఆంతర్యం మాత్రం క్లియర్ కట్ గా అదేనని ప్రజలందరికీ అర్థమైపోయింది. సర్కారీ పెద్దలు కూడా ఆ విషయాన్ని గ్రహించలేనంత దద్దమ్మలేం కాదు కదా. అనుకున్నదొకటి.. అవబోతున్నదొకటీ అన్న కనువిప్పు కలగడానికి వారికి పెద్దగా టైమేం పట్టలేదు. మరో వారం రోజుల్లో సమ్మెకు దిగుతామని నాలుగు జాక్ ల నేతలు డిక్లరేషన్ ఇచ్చిన వెంటనే కొంపలంటుకుపోబోతున్న దృశ్యం పాలకుల కళ్లకు కట్టింది. అందుకే వారు సమ్మె నోటీసు ఇచ్చే సమయానికంటే ముందే చర్చలకు రావాలని ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శశిభూషణ్ విజ్ఞప్తి చేశారు. అయితే సోమవారం 3 గం.కు సమ్మె నోటీసు ఇస్తామని, ఈలోగా పీఆర్సీ జీవోలను వాపసు తీసుకోవాలని, అలా తీసుకోని పక్షంలో చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని, నేరుగా మధ్యాహ్నం 3 గం.కు సమ్మె నోటీసు ఇచ్చి తీరుతామని ఉద్యోగ సంఘాల జాక్ నేతలు అల్టిమేటం జారీ చేశారు. దీంతో ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇదేంట్రా.. వార్నింగ్ ఇవ్వాల్సింది యజమాని కదా.. ఆఫ్టరాల్ పబ్లిక్ సర్వెంటుగాళ్లు అల్టిమేటం ఇవ్వడమేంటి? అనే ఆలోచనలో పడిపోయారు ప్రభుత్వ బాసులు. 

అంతేకాదు.. తామెన్నో ఆకులు చదువుకున్నామనుకున్న ప్రభుత్వ పెద్దల కళ్లు తెరిపించేలా అంతకంటే రెండాకులు ఎక్కువే చదివామని రుజువు చేసుకున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. నాలుగు సంఘాల జాక్ లు కలిసి ఒక్కో దానికి ముగ్గురు చొప్పున 12 మందితో పీఆర్సీ సాధన కమిటీని ఇప్పటికే డిక్లేర్ చేశారు. తాజాగా.. ఆ సంఖ్యను 20 మందికి పెంచుకొని సముద్రాన్ని దాటే హనుమంతుడి ఆకారాన్ని తలపింపజేశారు. ఎవరినైనా, ఎంతటివాారినైనా మేనేజ్ చేయడం ఈ సర్కారుకు గన్నుతో పెట్టినంత కాకపోయినా.. కనీసం బన్నుతో పెట్టినంత ఈజీనే అనేది ఆంద్రా ప్రజలందరికీ తెలుసు. అందుకే మరో అపూర్వమైన ఎత్తుగడ వేశారు. ఒక్కో జాక్ లో ప్రతినిధుల సంఖ్యను 5 కు పెంచుకొని ప్రభుత్వంతో చర్చించేవారి సంఖ్యను 20కి పెంచుకున్నారు. ఒకవేళ చర్చలకు వెళ్లినా ప్రభుత్వానికి చెమటలు పట్టించే స్కెచ్ ను పక్కాగా వేసుకున్నారు. ఇప్పటికే కొత్త పీఆర్సీ కి బదులు పాత పీఆర్సీ మాత్రమే తాము తీసుకుంటామని, అవసరమైతే సాలరీ ఒక నెల లేటైనా ఓర్చుకుంటామని, అంతేకానీ కొత్త పీఆర్సీని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని కరాఖండిగా తేల్చేశారు. ఇదే విషయం మీద ఉద్యోగ సంఘాలు కోర్టుకు వెళ్లినా ప్రభుత్వానికి (నైతిక) ఓటమి తప్పదు. ప్రగతికాముక ప్రభుత్వ హయాంలో తాజా పీఆర్సీలో ఏ ప్రగతీ కనిపించడం లేదని, అందుకే తమకు పాత పీఆర్సీనే ముద్దు అని ఉద్యోగ సంఘాల నేతలు న్యాయదేవత ముందు విన్నవించుకుంటే అక్కడ వీగిపోయేది ప్రభుత్వ వాదనే. ఆ లెక్కలేవో తేలేదాకా, తేల్చేదాకా పాత పీఆర్సీనే ఇంప్లిమెంట్ చేయమని, విచారణ జరిగేదాకా కొత్త పీఆర్సీ అమలుకు స్టే విధించమని కోర్టు ఆర్డరేస్తే ఆ నష్టం ఎవరికో తెలుసుకోలేనంత అమాయకులా ఈ ప్రభుత్వ పెద్దలు?

అందుకే మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని, ఉద్యోగ సంఘాలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఉంటారని శశిభూషణ్ కబురంపారు. అయితే పీఆర్సీపై అశుతోష్ మిశ్రా ఏం నివేదిక ఇచ్చారో తమకు వెల్లడించాలని, కొత్త పీఆర్సీ అమలును నిలిపివేశాక దేనిమీదైనా, ఎంతసేపైనా తాము చర్చించేందుకు సిద్ధమని, అసలు ప్రభుత్వం విధించిన కమిటీపై తమకు అధికారిక సమాచారం లేదని, ఆ కమిటీ పరిధులేంటో కూడా  తెలియదని, ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎవరితో చర్చించాలో కూడా స్పష్టత లేదంటూ ప్రభుత్వ డొల్లతనాన్ని జాక్ నేతలు విజయవంతంగా తిప్పికొట్టారు. తమతో పాటు ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి కూడా లబ్ధి జరిగేవరకు పోరాడతామంటూ ప్రభుత్వేతర ఉద్యోగుల మద్దతు కూడగడుతుండడం విశేషం. దీంతో ఎంకి  పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా జగన్ బాబుకు జ్ఞానోదయం కలిగిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

అంతేకాదు.. ఉద్యోగుల పట్ల, వారి సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ఈ ఘటన ద్వారా ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపారు జాక్ నేతలు. అందుకే అన్ని రకాల సమాచారాలతో ఉద్యమానికి సంసిద్ధులవుతున్న ఉద్యోగ సంఘాలు చాపకింద నీరులా జగన్ కుయుక్తులను ఎండగడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞాపనలు పంపిస్తున్నారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉందంటూ భ్రమించారో.. ఆ ప్రభుత్వానికి ఆయువుపట్టులా ఉన్న సాక్షి పత్రిక మూలాలను కదిలించే పనికి పూనుకున్నారు. మాయల మరాఠీ ప్రాణం చిలుకలో దాగున్నట్టు... జగన్ సర్కారు కొమ్ములు విరవాలంటే సాక్షిని దెబ్బ తీయాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే తెలుగు దినపత్రికల్లో రెండో స్థానంలో ఉన్న సాక్షి సబ్ స్క్రిప్షన్ ను నిలిపివేసేందుకు కంకణం కట్టుకున్నారు. ప్రజలను, ఉద్యోగులను ఆ దిశగా ఎంకరేజ్ చేస్తున్నారు. దాదాపు 11 లక్షల సర్క్యులేషన్ లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా  సబ్ స్క్రిప్షన్ రద్దు చేసుకుంటే ఒకే ఒక్క రోజు జగన్ సర్కారుకు తత్వం బోధపడుతుందని భావిస్తున్నారు. అంతేకాదు.. జాక్ నేతలు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తున్న సమయంలో ఆ అంశాన్ని అన్ని చానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాయి... ఒక్క సాక్షి తప్ప. దీన్ని దృష్టిలో పెట్టుకున్న జాక్ నేతలు ఇకపై ఉద్యోగులెవరూ సాక్షి చానల్ చూడరాదని నిర్ణయించుకోవడం విశేషం. ఉన్న పళంగా నాలుగైదు లక్షల మంది సాక్షి చానల్ చూడటం మానేస్తే టీఆర్పీ రేటింగ్ గణనీయంగా పడిపోవడం ఖాయం. ఈ విధంగా కూడా సాక్షికి వచ్చే రెవెన్యూ మూలాలను కదిలించే వ్యూహం పన్నారు. జాక్ నేతల పిలుపందుకుంటే కనీసం 4-5 లక్షల మంది సాక్షి పత్రిక సర్క్యులేషన్ 24 గంటల్లో పడిపోతుందని, చానల్ రేటింగ్ కూడా పడిపోతుందని, దీంతో కళ్లు నెత్తికెక్కిన సర్కారు కాస్తా ఉద్యోగుల కాళ్ల బేరానికి రాక తప్పదని అంచనా వేశారు. ఆఖరుకు వారి అంచనాయే నిజమైంది. సెల్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియాను ఆశ్రయించిన జాక్ నేతల ప్రచారంతో సర్కారు పెద్దలకు ఇంటెలిజెన్స్ రిపోర్టు వెళ్లిందని, 24 గంటల్లో సాక్షి పేపరు సర్క్యులేషన్ గనక దాదాపు 50 శాతం తగ్గిపోతే అనేక కంపెనీల్లో వాటాలు తారుమారవుతాయని, జగన్ కు ఆయువుపట్టులా మారిన బడా కార్పొరేట్ బినామీ కంపెనీలకు సాక్షి అండ లేకుండా పోతే ప్రభుత్వ పెద్దల ఆర్థికమూలాలు అతలాకుతలం అవుతాయని పెద్దలు గ్రహించినట్టున్నారు. 

అందుకే ఆ ఉపద్రవాన్ని నిరోధించాలంటే ఉద్యోగులను మచ్చిక చేసుకోక తప్పదని, వారిచ్చిన అల్టిమేటం కంటే ముందే 12 గంటలకు చర్చల కోసం కేటాయించారన్న వ్యాఖ్యానాలు ఉద్యోగ సంఘాల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఉద్యోగులందరినీ ఎలుకల్లా భావించి.. వారిని దారికి తెచ్చుకునేందుకు పిల్లి మెడలో గంట కట్టాలని భావించిన జగన్ సర్కారు... ఆఖరుకు తానే ఓ మాయదారి పిల్లిగా మారిపోయి ఉద్యోగులు అనే ఎలుకల ముందు పిల్లిమొగ్గలు వేస్తుండడమే అసలు ట్విస్టు. రానున్న రోజుల్లో మారబోయే పరిణామాలను జగన్ సర్కారు అప్పుడే గ్రహించిందంటున్నారు రాజకీయ పరిశీలకులు.