సిట్టింగుల్లో 60% గోడ దూకేశారు...

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలో అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్,నాలుగు వందల పైచిలుకు (403) అసెంబ్లీ స్థానాలు, 80 లోక్ సభ స్థానాలు ఉన్న రాష్ట్రం. మరో వంక గోవా చాలా చిన్న రాష్ట్రం. యూపీ అసెంబ్లీ స్థానాల్లో జస్ట్ ఓ పది శాతం 40 అసెంబ్లీ స్థానాలు, రెండే రెండు (నార్త్ గోవా, సౌత్ గోవా) లోక్ సభ స్థానాలున్న రాష్ట్రం గోవా. అయినా, యూపీలో  ఎన్నికల రాజకీయాలు ఎంత రంజుగా సాగుతున్నాయో గోవా రాజకీయాలు కూడా అంతే రంజుగా సాగుతున్నాయి. 

ముఖ్యంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో యూపీతో, గోవా పోటీ పడుతోందా, అనే విధంగా గోవాలో ఫిరాయింపులు జరుగుతున్నాయి. గడచిన ఐదేళ్ళలో మారీ ముఖ్యంగా గడచిన నెల రెండు నెలల్లో 403 మంది సభ్యులున్న ఉత్తరప్రదేశ్’లో 34 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అందులో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సహా  24  మంది సమాజవాదీ పార్టీ తీర్థం పుచ్చుకుంటే, బీజేపీ ఇతర పార్టీల నుంచి ఎనిమిది మందిని తమ వైపుకు తిప్పుకుంది. నాలుగొందల మంది ఎమ్మెల్యేలలోంచి ఐదేళ్లలో  34 మంది ఎమ్మెల్యేలు గోడ దూకడం మచ్చే అయినాఓకే అనుకోవచ్చును. కానీ, గోవాలో మొత్తం ఉన్నదే 40 మంది ఎమ్మెల్యేలే అయినా అందులో 24 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అంటే ఐదేళ్లలో 60 శాతం మందికి పైగా పార్టీ ఫిరాయించారు. ఇది భారత ప్రజా స్వామ్య చరిత్రలో, ఒక రికార్డు. ‘న ‘బూతో’ న భవిష్యతి’. 

ఈ ఫిరాయింపుల పుణ్యానే 2017 ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఇద్దరు మాత్రమే మిగిలారు. మరోవంక కేవలం 13 స్థానాల్లో గెలిచిన బీజేపీ, ఫిరాయింపుల రూటులో అధికారంలోకి వచ్చింది. సభలో సంఖ్యా బలాన్ని 13నుంచి 27కు పెంచుకుంది. అయితే ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత మైఖేల్ లోబో సహా నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ వదిలి పోయారు. మరో వంక తాజాగా గోవా మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు లక్ష్మీకాంత్ పర్సేకర్, పార్టీకి రాజీనామా చేశారు.. గత ఎన్నికలో ఒడి పోయిన ఆయనకు ఈ సారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. గత ఎన్నికకలో ఆయన్ని ఓడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీలో చేరి టికెట్ పట్టుకు పోయారు. దాంతో మాజీ ముఖ్యమంత్రి బీజేపీకి రాజీనామా చేశారు. ఇండిపెండెంట్’గా బరిలో దిగుతున్నారు. ఇంతకు ముందే మరో మాజీ ముఖ్యమంత్రి పారేకర్ కుమారుడు ఉత్పల్ పారేకర్ కూడా, పార్టీ టికెట్  నిరాకరించింది. ఆయన కూడా పార్టీకి రాజీనామాచేసి ఫ్యామిలీ అడ్డా పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. 

అదలా ఉంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలతో అతి పెద్ద పార్టీగా అవతరించి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక పోయింది. చివరకు, 15 మంది ఏమ్మేలు పార్టీ ఫిరాయించారు. ఈ  నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈ సారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇంతవరకు ప్రకటించిన 34 మంది పార్టీ అభ్యర్ధులను గుడి, చర్చి,మసీదుకు తీసుకు పోయి, “ ..... అనే నేను ఈ ఎన్నికల్లో గెలిస్తే పార్టీ ఫిరాయించనని, పార్టీ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తానని .. దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను” అని ప్రమాణం చేయించారుట. అయితే, దొంగకు మడి బట్ట అడ్డమా ...అన్నట్లు పార్టీ ఫిరాయించాలనుకునే వారికి ఈ ప్రతిజ్ఞలు , ప్రమాణాలు అడ్డు వస్తాయా .. ఏంటో .. ఎవరి పిచ్చి వారికి ఆనందం.