హిట్ల‌ర్ కూడా మ‌ట్టిలో క‌లిసిపోయారు.. బీపీ పెరిగితే ఆస్ప‌త్రికి వెళ‌తారు..

రెండున్న‌ర ఏళ్ల అరాచ‌క పాల‌న తారాస్థాయికి చేరింది. ప్ర‌తిప‌క్ష పార్టీని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసేందుకు ఉన్మాద చ‌ర్య‌లకు దిగుతున్నారు. కేసులతో బెద‌ర‌డం లేద‌ని.. ఏకంగా దాడుల‌కే తెగ‌బ‌డ్డారు. ఇటీవ‌ల చంద్ర‌బాబు నివాసంపై దాడి ప్ర‌య‌త్నం.. ఆ త‌ర్వాత కాకినాడ‌లో టీడీపీ-ప‌ట్టాభిల‌పై దాడి య‌త్నం.. తాజాగా ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాల‌యాల‌పై విధ్వంస‌కాండ‌. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డం.. గంజాయి దందా, జీతాలు ఆల‌స్యం, ప‌థ‌కాల కోత‌, పన్ను బాదుడు, అప్పుల కుప్ప నుంచి డైవ‌ర్ట్ చేయ‌డానికి.. దాంతో పాటు టీడీపీనీ భ‌య‌పెట్టాల‌నే వ్యూహంతో ఇలా మూక‌దాడుల‌తో రెచ్చిపోయార‌ని అంతా త‌ప్పుబ‌డుతున్నారు. ఇంత జ‌రిగినా సీఎం జ‌గ‌న్ మాత్రం వైసీపీ దాడుల‌ను స‌మ‌ర్థించుకోవ‌డం హీనాతి హీనం అంటున్నారు. త‌న‌ను తిడితే, త‌న అభిమానుల‌కు బీపీ వ‌చ్చి ఇలా దాడి చేశారంటూ జ‌గ‌న్ చేసిన దారుణ‌మైన వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. తాజాగా, జ‌గ‌న్ స్టేట్‌మెంట్‌పై టీడీపీ సీనియ‌ర్ నేత అశోక్ గ‌జ‌ప‌తిరాజు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. 

రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ఫైర్ అయ్యారు. కరుడుగట్టిన నియంత హిట్లర్ కూడా మట్టిలో కలసిపోయారని ముఖ్యమంత్రి తెలుసుకోలేక పోతున్నారని అన్నారు. బి.పి పెరిగితే ఆసుపత్రికి వెళతారు.. అంతేగాని టీడీపీ కార్యాలయాలపైకి, నేతల ఇళ్లపైకి వెళ్లి దాడులు చేయ‌రు.. అలా చేసే వారిని ముఖ్యమంత్రి ప్రోత్సహించటం హేయమని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తన రాజకీయ అనుభవంలో ఇంత ఘోరం తానెన్నడూ చూడలేదన్నారు అశోక్ గ‌జ‌ప‌తిరాజు. బాధితులపైనే అక్రమ కేసులు పెట్టడం ఏ రాజ్యాంగంలోనూ ఉండదని చెప్పారు.  నాగరిక ప్రపంచంలో ఉంటూ మంత్రులు ఏ విధమైన భాష వినియోగిస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి మాట తీరు ఎలా ఉండేదో కూడా ప్రజలందరికీ తెలుసని గుర్తు చేశారు. అధికార పార్టీ జవాబుదారిగా ఉంటే ప‌ద్ద‌తిగా ఉంటుంద‌ని అశోక్ గజపతిరాజు హితవు పలికారు. మ‌రి, అధికారంతో క‌ళ్లు, చెవులు మూసుకుపోయి ఉన్న వైసీపీ ప్ర‌భుత్వానికి ఇలాంటి మంచి మాట‌లు త‌లకెక్కుతాయా? అంటున్నారు.