లోకేష్ దెబ్బకు జగన్ అబ్బా! 

తిరుపతి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సభ రద్దే ఇప్పుడు ప్రధానంగా మారింది. సీఎం పర్యటన వాయిదాపైనే తిరుపతి రాజకీయమంతా సాగుతోంది. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీకి ఇదొక బ్రహ్మాస్తంగా మారగా... అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని మాత్రం డిఫెన్స్ లో పడేసింది. నారా లోకేష్ విసిరిన సవాల్ కు భయపడే.. జగన్ తిరుపతి రాకుండా పారిపోయారనే ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు.

తిరుపతిలో సీఎం జగన్ సభ కన్ఫామ్ కాగానే నారా లోకేష్ ఆయనకు సవాల్ విసిరారు.  జగన్ నువ్వు తిరుపతికి 14న వస్తున్నావంట… నిజంగా మీ బాబాయిని నువ్వు చంపకపోతే తిరుమల వెంకన్న సన్నిధిలో ప్రమాణం చేయగలవా? అని లోకేష్ సవాల్ విసిరారు. ఇప్పుడు జగన్ సభ రద్దు కావడంతో .. లోకేష్ సవాల్ ప్రకారం ప్రమాణం చేయకపోతే జనాలకు రాంగ్ మెసేజ్ వస్తుందనే భయంతోనే జగన్ .. తన పర్యటనను కరోనా సాకుతో రద్దు చేసుకున్నారని తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. 

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి పర్యటన రద్దుపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. నిన్నమొన్నటి వరకు కరోనా లేదు, గిరోనా లేదు ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన జగన్.. నేడు అదే కరోనా పేరు చెప్పి తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని, ఇది పిరికితనం కాక మరేంటని ఎద్దేవా చేశారు. జగన్ విచిత్రమైన వ్యక్తి అని, ఆయన రివర్స్‌లో పనిచేస్తారని విమర్శించారు.వివేకానందరెడ్డి హత్య కేసులో ఎక్కడ ప్రమాణం చేయాల్సి వస్తుందోనన్న భయంతోనే జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని అన్నారు. ఆయన హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ప్రమాణం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు అన్నారు.

'మీ తిరుపతి ఎన్నిక‌ల‌ సభ ఎందుకు వాయిదా వేశారు ముఖ్యమంత్రి గారూ, కరోనా భయంతోనేనా? మరి మిగతా నాయకుల సభలకు జనం తండోప తండాలుగా వస్తున్నారు. అదే నిజమైతే, ఎన్నికలు వాయిదా వెయ్యాలిగా? అసలు మీ భయం, కరోనా గురించా, లేక "బాబాయిని చంపిందెవరని" జనం నిలదీస్తారనా? తెగేదాక‌ లాక్కండి సార్, పబ్లిక్ సార్' అని టీడీపీ నేత  వ‌ర్ల రామ‌య్య విమ‌ర్శ‌లు గుప్పించారు.

మరోవైపు  ఇంటెలిజెన్స్ సర్వేలో వైసీపీ కేండిడేట్ గురుమూర్తికి గెలుపు అవకాశాలు తక్కువేనంటూ నివేదికలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. తనకు పాదసేవ చేశాడనే ఏకైక కారణంతో ప్రజలకు పెద్దగా పరిచయంలేని ఫిజియోథెరపిస్టు గురుమూర్తిని పోటీలో నిలపడంపై ఓటర్లు పెదవి విరిచారు. ప్రచారంలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు టీడీపీ ఎన్నికల ప్రచారంలో దుమ్ము రేపుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌లకు తిరుపతిలో అడుగడుగునా ప్రజలు నుంచి విశేష స్పందన వస్తోంది. దీంతో గురుమూర్తి గెలుపు కష్టసాధ్యం కావడంతో జగన్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఒకవేళ తాను ప్రచారం నిర్వహించినా వైసీపీ అభ్యర్థి ఓడిపోతే తన పరువు పాతాళానికి పడిపోతుందని భయపడుతున్నారట. అందుకే కరోనా కేసులను సాకుగా చూపి.. తిరుపతికి రాలేనంటూ లేఖ రాసి.. హమ్మయ్యా అని జగన్ చేతులు దులిపేసుకున్నారని భావిస్తున్నారు.