ఏపీలో అరాచక పాలన.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల మధ్య మంచి సంబంధాలున్నాయి. ఏపీ సీఎం జగన్ తనకు అత్యంత సన్నిహితుడని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. చాలా సార్లు ఓపెన్ గానే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ ను ప్రశంసిస్తూ ప్రకటనలు చేస్తుంటారు. టీఆర్ఎస్ పాలన బాగుందంటూ వైసీపీ ప్రజా ప్రతినిధులు... ఏపీలో జగన్ అద్భుతంగా పని చేస్తున్నారంటూ గులాబీ లీడర్లు స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. కాని ఇప్పడు మాత్రం సీన్ మారినట్లు కనిపిస్తోంది. ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జగన్ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఖమ్మంలో నిర్వహించిన సంకల్ప సభలో కేసీఆర్ ను టార్గెట్ చేశారు వైఎస్ షర్మిల. తెలంగాణ బిడ్డనని చెప్పుకున్న షర్మిల.. దొర పాలనంటూ కేసీఆర్ పై తీరుపై విరుచుకుపడింది. కేసీఆర్‌ హయాంలో పెన్షన్లు లేవు, కార్పోరేషన్లకు నిధులు లేవు. దళితులకు మూడెకరాల భూమి ఏమైంది సీఎం సారూ?' అంటూ షర్మిల సీఎంపై విమర్శలు గుప్పించారు. 'ప్రజా సమస్యలు వినే ఓపిక ఈ దొరలకు ఉందా? సచివాలయంలో అడుగుపెట్టని ఇలాంటి సీఎం దేశంలో ఎవరూ లేరు. తాను అడుగుపెట్టని సచివాలయం ఎందుకని కూల్చేశాడు. ఏ అధికారి ఎక్కడ పనిచేస్తున్నాడో అర్థం కావట్లేదు. సింగరేణి కార్మికుల మైనింగ్‌ సమస్య తీరిందా? కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు మీకు పట్టవా?..' అంటూ ఘాటుగా ప్రశ్నించారు షర్మిల. 

వైఎస్ షర్మిల తనను తాను తెలంగాణవాది అని చెప్పుకోవడంపై ఖమ్మం జిల్లా సత్తుపల్లి  టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తీవ్రంగా స్పందించారు.  షర్మిల ఎప్పటికీ ఆంధ్రావాదియే అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను విమర్శించే స్థాయి ఆమెకు లేదని మండిపడ్డారు. పదువులకు ఆశపడి ఎవరో డైలాగులు రాసిస్తే... షర్మిల వాటిని చదువుతున్నారని సండ్ర వెంకట వీరయ్య ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అసలు ప్రజాస్వామ్యం లేదని... అక్కడ అరాచక పాలన కొనసాగుతోందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. షర్మిల తన అన్న మీద పోరాటం చేయలేక తెలంగాణకు వచ్చి పోరాటం చేస్తాననడం,ప్రశ్నించే గొంతుక అవుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సినిమా స్క్రిప్ట్,డైలాగులు చదువుతూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన కొనసాగుతోందంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర ఆరోపించడం కలకలం రేపుతోంది. పార్టీ పెద్దలకు తెలియకుండా జగన్ సర్కార్ పై సండ్ర ఇలాంటి వ్యాఖ్యలు చేయరని అంటున్నారు. ఇటీవల కాలంలో ఏపీ సర్కార్ తో కేసీఆర్ కు సఖ్యత కొంత చెడిపోయిందని తెలుస్తోంది. బీజేపీ డైరెక్షన్ లో తెలంగాణలో షర్మల పార్టీ వస్తుందని భావిస్తున్నారట కేసీఆర్. షర్మిలకు జగన్ అండదండలు ఉన్నాయని నమ్మకంగా చెబుతున్నారట. షర్మిల పార్టీతో తమకు ఇంతకాలం ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీ, క్రిస్టియన్, దళిత ఓట్లకు గండి పడే అవకాశం ఉందని గులాబీ బాస్ ఆందోళనలో ఉన్నారంటున్నారు. అందుకే ఇకపై షర్మిలతో పాటు జగన్ కు టీఆర్ఎస్ టార్గెట్ చేస్తుందని చెబుతున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu