వైసీపీ ఎంపీలు రాజీనామా?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు త్వరలో రాజీనామా చేయబోతున్నారా? తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక వేదికగా వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారాయి. వైసీపీ ఎంపీలు రాజీనామాకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి.

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో సీఎం జగన్ పాల్గొంటారని గతంలో షెడ్యూల్ వచ్చింది. ఈనెల 14న జగన్ సభకు వైసీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. అయితే  తిరుపతి పర్యటనను సీఎం జగన్ రద్దు చేసుకున్నారని శనివారం ప్రకటన వచ్చింది. కరోనా ఉధృతి కారణంగా సీఎం సభ రద్దైందని వైసీపీ ప్రకటించింది. అయితే దీని రాజకీయ రచ్చ జరుగుతోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విసిరిన సవాల్ కు భయపడే జగన్ తిరుపతి రావడం లేదనే చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. తిరుపతిలో వైసీపీ ఓడిపోతుందని నిఘా వర్గాలు నివేదిక ఇవ్వడం వల్లే జగన్ ప్రచారానికి రావడం లేదని మరికొందరు నేతలు విమర్శిస్తున్నాయి.

టీడీపీ నేతల ఆరోపణలకు కౌంటరిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి. కరోనా ఉధృతి కారణంగానే జగన్ సభ రద్దైందని చెప్పారు. తిరుపతిలో వైసీపీకి భారీ మెజార్టీ రావడం ఖాయమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నామని ప్రకటించారు. అందుకు చంద్రబాబు సిద్దమా అని ప్రశ్నించారు. తిరుపతిలో వైసీపీ ఓడిపోతే... వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేస్తారని ప్రకటించారు మంత్రి పెద్దిరెడ్డి. టీడీపీ ఓడిపోతే.. మీ పార్టీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. 

మంత్రి పెద్దిరెడ్డి సవాల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తి రేపుతోంది. తిరుపతి లోక్ సభ పరిధిలో చంద్రబాబు ప్రచారానికి భారీ స్పందన వస్తోంది. నారా లోకేష్ రోడ్ షోలకు జనాలు తరలివస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ప్రసంగాలకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి సవాల్ ను చంద్రబాబు స్వీకరిస్తే.. తిరుపతి ఉప ఎన్నిక మరింత రంజుగా మారే అవకాశం ఉంది.