విశాఖ ఉక్కు బంద్.. రైల్వే జోన్ కూడా అలాంటి హమీనేనా?
posted on Mar 28, 2022 11:00AM
ఆంధ్రప్రదేశ్ పై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సీతకన్నేసింది. కనీసం ఒక్క శాతం ఓట్లు అయినా వేయని, ఒక్క ఎంపీ, ఒకటో రెండో ఎమ్మెల్యే సీట్లు అయినా ఇవ్వని రాష్ట్రానికి,నిధులు ఎందుకివ్వాలి,, పనులు ఎందుకు చేయాలి అనుకుందో ఏమో కానీ, గడచిన ఎనిమిదేళ్ళలో ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజి, జాతీయ ప్రాజెక్ట్ ‘గా గుర్తించిన పోలవరం ప్రాజెక్ట్’ కునిధులు, వెనకబడిన ప్రాంతల అభివృద్ధి నిధులు, విశాఖ రైల్వే జోన్’ ఇలా ఒకటని కాదు, ఏ ఒక్క విధంగానూ, ఏపీకి మోడీ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదు. ఇది నిజం.
ఇక, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు, వామపక్షాలు, పారిశ్రామిక ఉద్యోగ సంఘాలు ‘విశాఖ బంద్’ చేపట్టాయి. ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద కార్మిక సంఘ నాయకుల నిరసన తెలిపారు. ప్రజాసంఘాలు ర్యాలీ నిర్వహించాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ జోలికి వస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ప్లాంట్‌పై అవగాహన లేకుండా కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారని కార్మికులు మండిపడ్డారు. ప్లాంట్‌ను అమ్మే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా పార్లమెంట్ సాక్షిగా అసత్యాలు చెబుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు, పారిశ్రామిక ఉద్యోగ సంఘాలు రెండు రోజుల పాటు బంద్‌కు పిలుపునిచ్చింది.
తాజాగా పార్లమెంట్‌లో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. ఇంతకాలం ఏవేవో సాకులు చెపుతూ ఎటూ తేల్చకుండా నాన్చుతూ వచ్చిన, విశాఖపట్నం రైల్వే జోన్ అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు, వైజాగ్ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదనలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అదే క్రమంలో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు డీపీఆర్ పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
విశాఖ రైల్వే జోన్ తో పాటు రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం 2020-21 బడ్జెట్ లో రూ.170 కోట్లు కేటాయించామన్నారు. రైల్వో జోన్, రైల్వే డివిజన్ పరిధితో పాటు పలు అంశాలు తమ దృష్టకి వచ్చాయని.. ఇందుకోసం అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవల్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ముందస్తు కసరత్తు, ప్రణాళికలు చెపట్టాల్సిందిగా వైజాగ్ లోని సౌత్ కోస్టల్ రైల్వే ఓఎస్టీకి ఇప్పటికే నిర్దేశించామన్న రైల్వే మంత్రి.. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ప్రధాన హెడ్ ఆఫీస్ భవనాలు నిర్మాణానికి భూమి కూడా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి భూ సర్వే, ఆఫీస్ లే అవుట్, సిబ్బంది క్వార్టర్స్, ఇతర నిర్మాణ పనులకు సంబంధించిన కార్యకలాపాలు మొదలుపెట్టాలని అధికారులకు సూచించినట్లు మంత్రి తెలిపారు.
రైల్వే జోన్ ఏర్పాటులో అడ్మినిస్ట్రేటివ్, మేనేజ్ మెంట్ అవసరాలతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతో రైల్వే జోన్ ఏర్పాటు, దాని పరిధిపై నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. సౌత్ సెంట్రల్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వేను విభచింది.. వైజాగ్ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటవుతుందని.. అలాగే వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా డివిజన్ ఏర్పాటుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రైల్వే మంత్రి పేర్కొన్నారు.
అయితే, ఇల్లు అలకగానే,పండగ రాదు. అలాగే రాజ్య సభలో మంత్రి ప్రకట చేసినంత మాత్రాన విశాఖ రైల్వే జోన్’ వచ్చినట్లు కాదు. ఇదే పెద్దల సభలో, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదా, హమీకే దిక్కు లేదు. మోడీ ప్రభుత్వం తిమ్మిని బమ్మిని చేసి, హోదను ప్యాకేజిగా మర్చి చివరకు రెంటికీ మగళం పడేసింది . సో ..అప్పుడే ఆనంద బాష్పాలు కురిపించవలసిన అవసరం లేదని అంటున్నారు. అయితే ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు మాత్రం అదేదో అయిపొయింది అన్నట్లుగా సంతోషం వ్యక్త పరిచారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతం ఆయిందని కేంద్ర మంత్రి ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు.విశాఖ రైల్వే జోన్ అనేది ఏపీ ప్రజల చిరకాల కోరిక అని అన్నారు.