రాజకీయ సయోధ్య మూన్నాళ్ళ ముచ్చటేనా?

పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి  ఒక్కటయ్యాయి. ఐక్యతను  ప్రదర్శించాయి. ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. మాలో మాకు సవాలక్ష విబేధాలు ఉండవచ్చును కానీ..  మా దేశం పై మరో దేశం ఏ రూపంలో దాడి చేసినా, రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కటై నిలుస్తామని శతృ మూకకు స్పష్టమైన హెచ్చరిక చేశాయి. దేశం గర్వించేలా అధికార, ప్రతిపక్ష నాయకులు, చేతులు కలిపి సయోధ్య  ప్రదర్శించారు.

అవును పహల్గాం ఉగ్ర దాడి పై చర్చించేందుకు ఏప్రిల్ 24 న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, ఎంఐఎం సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కాంగ్రెస్ అగ్ర నేతలు, రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే సహా  అన్ని పార్టీల నాయకులు సర్కార్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేందుకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, మద్దతు ఇస్తామని  అండగా నిలుస్తామని ‘బ్లాంక్ చెక్ ’ ఇచ్చారు. సంపూర్ణ మద్దతు ఇచ్చారు. సయోధ్య ప్రకటించారు.

అయితే.. ఈ మాటల తడి ఇంకా పూర్తిగా అరక ముందే.. వాతావరణం వేడెక్కుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అవును  అఖిలపక్ష సమావేశంలో వ్యక్తమైన సయోధ్యకు ఇంతలోనే   చుక్కెదురు అయిందా?  ఇంతలోనే సయోధ్యకు చిల్లు పడిందా?  అనే  అనుమనాలు, ఆందోళన వ్యక్త మవుతున్నాయి. 

ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ స్వరం మెల్లమెల్లగా మారుతోందని అంటున్నారు.  ఏప్రిల్ 24న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో భద్రతా లోపాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపక్షాలకు తప్పడు సమాచారం ఇచ్చిందని, తప్పు దోవ పట్టించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తృణమూల్ కాంగ్రెస్ స్వరం కలిపింది. 

అఖిల పక్ష సమావేశంలో  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు, ఉగ్రదాడి జరిగిన  బైసరాన్ లోయలో పర్యటించేందుకు టూర్ ఆపరేటర్స్  స్థానిక అధికారుల అనుమతి తీసుకోలేదనీ,   అలాగే  సహజంగా బైసరాన్  లోయలో పర్యాటకుల సందర్శనకు జూన్  లో అనుమతిస్తారనీ,  కానీ ఈసారి స్థానిక అధికారులు, పోలీసుల అనుమతి లేకుండానే టూరిస్ట్  ఆపరేటర్స్ ఏప్రిల్ 20 నుంచే బైసరాన్  లోయకు పర్యాటకులను  తీసుకు పోయినట్లు పేర్కొన్నారు. అయితే  హోం శాఖ అధికారులు ఇచ్చిన ఈ సమాచారం తప్పని  బైసరాన్ లోయ ఒక్క మంచు కురిసే కాంలో తప్పించి, సంవత్సరం పొడుగునా తెరిచే ఉంటుందిని  స్థానిక పత్రికలలో కథనాలు వచ్చాయి. ఈ పత్రికా కథనాలే.. విపక్షాలకు ఆయుధం అయ్యాయి.  

అవును ఆ పత్రికా కథనాలను ఉటంకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ మీడియా సెల్ ఇంచార్జి, జైరాం రమేష్  సోషల్ మీడియా ప్లాట్ ఫారం   ‘ఎక్స్’  వేదికగా  చిన్నగా  చిచ్చు పెట్టారు.  అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చినట్లుంది.  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  అధ్యక్షతన ఏప్రిల్ 24 న జరిగిన అఖిలపక్ష సమావేశంలో సరైన  సమాచారం ఇచ్చినట్లు లేదు. నిజానికి  తప్పుడు  సమాచారం యిచ్చినట్లుంది  అంటూ, ఒక అస్పష్ట పోస్టు పెట్టారు. చిచ్చు రాజేశారు. ఆవెంటనే  మరో కాంగ్రెస్ ఎంపీ రందీప్ సుజ్రేవాలా  ఒక అడుగు ముందుకేసి  దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయ మన్నట్లు, పహల్గాం  ఉగ్ర దాడిలో ఇంటెలిజెన్స్, భద్రతా వైఫల్యాలు జరిగాయని నిర్ధారించారు. ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు  అఖిల పక్ష సమావేశానికి, మొత్తం దేశానికీ దేశానికీ ఎందుకు  అబద్దం చెప్పారంటూ  ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  అలాగే..  తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు, మాజీ జర్నలిస్ట్ సాగరికా ఘోష్  కూడా కాంగ్రెస్ తో గొంతు కలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం, హోం మంత్రి అమిత్ షా, ఎందుకు ప్రతిపక్షాన్ని తప్పు దో పట్టించారు? అంటూ ప్రశ్నించారు. 

అయితే.. ఏవో కొన్ని స్థానిక పత్రికల్లో వచ్చిన కధనాల అధారంగా కాంగ్రెస్, తృణమూల్  నాయకులు..  ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లు అసత్యాన్ని ప్రచారం చేయడం ఏమిటని బీజేపీ ఎదురు దాడికి దిగింది. అంతే కాకుండా అఖిలపక్ష  సమావేశంలో ఇచ్చిన మాటను  కాంగ్రెస్ పార్టీ  ఇంతలోనే ఎందుకు తప్పుతోందని  అధికార బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు..  నువ్వోకటంటే మేము నాలుగు అంటాం  అంటూ బీజీపీ రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది ఇందిరా గాంధీ మర్డర్ మొదలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక భద్రతా లోపాలాను ప్రస్తావిస్తూ ఎదురు దాడికి దిగారు. దీంతో ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు  అవుతుందని గ్రహించి కావచ్చును, కాంగ్రెస్ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే   సెక్యూరిటీ లోపాల గురించి  హోం మంత్రి అమిత్ షా అఖిల పక్ష సమావేశంలో అంగీకరించారు.  సో.. తానా విషయంలోకి పోను కానీ  1961 సిందూ నదీ జలాల ఒప్పందం నిలిపి వేయడంపై అభ్యంతరం వ్యక్తపరిచారు. దిగువకు నీరు పంపకుండా  ఎలా నిలుపుతారు అంటూ నిలదీశారు? అసాధ్యమంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు. 

అయితే..  ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇంతలోనే  ‘యు’ టర్న్ తీసుకోవడం, కాంగ్రెస్ వెంట తృణమూల్ అడుగులు వేయడం, మరో వంక కర్ణటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పాకిస్థాన్ పై యుద్ధం వద్దని అనడం వంటి  పరిణామాలను  గమనిస్తే..  అఖిల పక్ష సమవేశంలో వ్యక్తమైన రాజకీయ సయోధ్య మూన్నాళ్ళ ముచ్చ టేనా  అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.