మరోసారి మోసపోయిన శ్రీవారి భక్తులు

 

కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని  తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు. తీరా కొండకు చేరుకున్న తర్వాత పది రోజుల ముందే ఒక వ్యక్తి మొబైల్ నుండి వచ్చిన  తోమాల, అభిషేక సేవా టికెట్లను తమ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే క్రమంలో అవి నకిలీవి అని తేలడంతో విస్తు పోయారు. వెంటనే తిరుమల వన్ టౌన్ పోలీసులకు  ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా మీరు ఎక్కడ నుండి మొబైల్ ట్రాన్సాక్షన్  చేశారో ఆ పరిధి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని చెప్పడంతో చేసేదేమీ లేక తమ వద్ద ఉన్న ఉచిత టైం స్లాట్ దర్శన టోకెన్లతో వెళ్లి స్వామి వారిని  దర్శించుకుని గురువారం వెనుతిరిగారు. 

వివరాల్లోకెళితే తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన విజయ్ ఒక ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. తన మిత్రుడి ద్వారా బాలాజీ అనే వ్యక్తి నంబరు పొందాడు. బాలాజి మీకు కోరిన దర్శనం చేయిస్తాడని చెప్పడంతో అతనిని సంప్రదించి దపదపాలుగా బాలాజీ అకౌంట్ నెంబర్ కు రూ. 65 పంపాడు. అందుకు పది రోజుల క్రితం విజయ్ కుటుంబ సభ్యులు ఐదు మంది పేర్లతో టీటీడీ లోగో కలిగిన నకిలీ తో మాల సేవ టికెట్టును 03-07-2025 తేదికి, మరుసటి రోజు 04-07-2025 తేదీ శుక్రవారం రోజుకి 6 మందికి కలిపి ఒక నకిలీ టికెట్టును అనుమానం రాకుండా నెట్ లో తయారు చేయించి విజయ్ మొబైల్ కు పంపాడు. అలాగే ఒక సూట్ రూమ్ కు కూడా వారి పేరుతో   నకిలీ రసీదు ను పంపాడు. వారు స్వామివారు మనకు మంచి సేవలు ఇచ్చారు అనే ఆనందం లో బుధవారం 
తిరుమలకు చేరుకున్నారు. 

ఎందుకైనా మంచిదే అని తిరుపతిలో ఉచిత టైమ్ స్లాట్ టోకెన్లు పొందారు. తీరా  మీరు మాకు బుక్ చేసిన గదిని పొందేందుకు ఎక్కడికి వెళ్లాలని అడిగేందుకు బాలాజీకి ఫోన్ చేశారు. అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోగా మెసేజ్ లకూ స్పందించలేదు. దాంతో అనుమానం కలిగి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. రిఫరెన్స్ అనేది టికెట్ పైన లేకుండా దర్శనం టికెట్టు మంజూరు కాదు. ఎంతటి వి.వి.ఐపీ లు అయినా ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారే స్వయంగా వస్తే తోమాల సేవను  ఒకరికి లేక ఇద్దరికీ మంజూరు చేస్తారు. అలాగే పూరాభిషేకం కూడా ప్రోటోకాల్ పరిధిలో ఉన్నవారికి ఒక్కటి లేక రెండు మంజూరు చేస్తారు. 


ఇలా ఎలా మోసపోయారని తిరుమల పోలీసులు బాధితుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. దళారీలు మాత్రం శ్రీవారి భక్తులను మోసం చేసేందుకు రక రకాల కొత్త మార్గాలను ఉపయోగించి దోచేస్తున్నారు. ఇటువంటి మోసాలపై ఇటు టీటీడీ, అటు పోలీసులు బయట వ్యక్తులను నమ్మకండి... టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని పదే పదే కోరుతున్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలతో భక్తులు మోసపోతూనే ఉన్నారు. కాగా నకిలీ టికెట్లతో భక్తులను మోసం చేసిన బాలాజీ బ్యాంక్ అకౌంట్ కడప జిల్లా ఒంటిమిట్టలో ఉన్నట్లు బాధిత భక్తుడు విజయ్ తెలిపారు.