ఇండియా కూటమిలో శ్రుతి తప్పిన ఐక్యతా రాగం!
posted on Jan 25, 2024 10:05AM
సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో విపక్షాల ఐక్యతారాగం అపశ్రుతులు పలుకుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీయేతర పార్టీల ఐక్యత ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. 2024 ఎన్నికలలో మోడీ సర్కార్ ను గద్దె దించాలంటే విభేదాలు మరచి బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిమీదకు రావడం ఒక్కటే మార్గమన్న విషయంలో ఎవరిలోనూ భిన్నాభిప్రాయాలు లేవు. ఆ కారణంగానే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేను ఓడించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గద్దె దింపడమే ఏకైక అజెండాగా ఐ డాట్ ఎన్ డాట్ డి డాట్ ఐ డాట్ ఎ… ఇండియా పేర బీజేపీయేతర పార్టీలన్నీ కూటమిగా ఏర్పడ్డాయి. ఆ చుక్కల కూటమి... నడక తడబడుతోంది. లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయా అంటే పరిశీలకులు లేదంటూ విశ్లేషిస్తున్నారు.
కూటమి కలలకు శ్రీకారం చుట్టిన, జనతాదళ్ (యు) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముందుగా పక్కదారి పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కూటమికి నాయకత్వం వహించడం ద్వారా బీహార్ సీఎం పదవి నుంచి ఇండియా పీఎం పీఠానికి చేరాలన్న ఆయన ఆకాంక్ష సాకారమయ్యే అవకాశాలు లేవన్న గ్రహింపు వచ్చినప్పటి నుంచి ఆయన నడక, నడతలో మార్పు వచ్చింది. ముఖమాటానికో, రాజకీయ అవసరం కోసమో కూటమి కన్వీనర్ పదవిని సున్నితంగా తిరస్కరించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకే ఆ పదవిని కట్టబెట్టినప్పటి నుంచీ కూడా ఆయన ఇండియా కూటమితో తెగతెంపులు చేసుకోవడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారన్నట్లుగానే ఆయన తీరు ఉంది.
తాజాగా ఆయన ఇంకెంతో కాలం కూటమిలో కొనసాగే అవకాశం లేదన్న సంకేతాలను ఇచ్చారు. అందుకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి దివంగత కర్పూరి ఠాకూర్ కు మోడీ సర్కార్ దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడాన్ని అవకాశంగా తీసుకున్న నితీష్ కేంద్రంపై ప్రశంసల జల్లు కురిపించడం ద్వారా తాను ఇండియా కూటమికి దూరంగా అడుగులు వేస్తున్నట్లు తేటతెల్లం చేశారు. నితీష్ కుమార్ కర్పూరి ఠాకూర్ కు భరాతరత్న ప్రకటించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పి ఊరుకోలేదు. కర్పూరి ఠాకూర్ శతజయంతి వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా మోడీ వెనకబడిన కులాలకు ఓ మంచి సందేశం ఇచ్చిందని ప్రస్తుతించారు.
కర్పూరి ఠాకూర్‌ను రాజకీయ గురువుగా భావించే నీతీశ్ కుమార్.. దివంగత సీఎం పుట్టి పెరిగిన గ్రామాన్ని ‘కర్పూరి గ్రామ్’గా మార్చారు. ఏటా ఆయన జయంతి వేళ నీతీశ్ ఆ గ్రామాన్ని సందర్శిస్తారు. కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న ఇవ్వాలని తాను పలు మార్లు కేంద్రానికి లేఖలు రాశానని చెప్పుకున్న ఆయన గత కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనిని మోడీ సర్కార్ చేసిందంటూ చెప్పడం ద్వారా కాంగ్రెస్ కు దళితులు, వెనుకబడిన కులాల అభ్యున్నతి పట్ల చిత్తశుద్ధి లేదని పరోక్షంగా అన్నట్లు అయ్యింది. తద్వారా ఆయన మళ్లీ కమలం కు చేరువ కానున్నట్లు సంకేతాలు ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తో పొత్తు లేదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కుండబద్దలు కొట్టేశారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కూటమితో కలిసి నడుస్తున్నప్పటికీ ఆయన వ్యూహాలు ఆయనవే. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల వేళ కూటమి భాగస్వామ్యపక్షాల వ్యవహార శైలి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సాగుతోంది. కూటమి ఐక్యతాలోపమే బీజేపీకి వచ్చే ఎన్నికలలో బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.