జనసేన గూటికి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ!
posted on Jan 25, 2024 10:48AM
ఎంతలో ఎంత మార్పు. గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ పక్షాన నిలబడి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శల నిప్పులు చెరిగిన నటుడు, ధర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ ఇప్పుడు ఆ జనసేనాని పవన్ కల్యాణ్ పంచన చేరారు. ఔను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
ఇదే పృధ్విరాజ్ గత ఎన్నికలకు ముందు సరిగ్గా ఇప్పుడు జనసేనలో చేరినట్లుగానే అప్పడు అంటే 2019 ఎన్నికలకు ముందు జగన్ నాయకత్వంలోని వైసీపీలో చేరారు. అ ఎన్నికలలో వైసీపీ విజయం కోసం చాలా చాలా కష్ట పడ్డారు. జగన్మోహన్ రెడ్డిని వేనోళ్ళ పొగుడుతూ ఉరూరా తిరిగారు. పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆ ప్రచారంలో భాగంగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ ను లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా విమర్శలు గుప్పించారు. తనకు నోరున్నదే వారిని విమర్శించడానికి అన్నట్లుగా రెచ్చిపోయారు. ఆయన ప్రచారమో రాష్ట్ర ప్రజల దురదృష్టమో ఆ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
సీఎం అయిన తరువాత ఆయన పృధ్వీ సేవలను మరచిపోలేదు. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిలో కూర్చోబెట్టారు. తన రాజకీయ ప్రత్యర్థులను ఇష్టారీతిగా విమర్శించడమే ఆ పదవి దక్కడానికి పృధ్వికి అర్హత అయ్యింది. ప్రతి పక్ష పార్టీల నాయకులను ఎంత పెద్దగాతిడితే, అంతగా ముఖ్యమంత్రి దృష్టిలో పడొచ్చని. మరో మెట్టు ఎక్కచ్చని అనుకున్నారో ఏమో కానీ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని అడ్డు పెట్టుకుని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకు పడ్డారు. చివరకు అమరావతి రైతుల ఆందోళలోనూ వేలు పెట్టారు. అమరావతి రైతుల ఉద్యమంపై థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన డర్టీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయ్యాయి.
ఆయన వివాదాల జర్నీ అక్కడితో ఆగలేదు. ఎస్వీబీసీలో పని చేసే ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఫృధ్వి ఎస్వీబీసీ చైర్మన్ వైభోగం మూన్నాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది. ఆ పదవి నుంచి జగన్ నిర్దాక్షిణ్యంగా తప్పించేశారు. అంతే ఇక ఆ తరువాత వైసీపీలో ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్విని పట్టించుకున్న వారే లేదు. అదే సమయంలో నడమంత్రపు సిరి శాశ్వతం నుకుని రెచ్చి పోయి వెనకా ముందు చూసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడిన పృధ్విని ఇండస్ట్రీ కూడా దాదాపు వదిలించేసుకుంది. కొంచెం ఆలస్యంగానే అయినా, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తత్త్వం బోధపడినట్లుంది. అప్పటికి కానీ పృధ్వికి తత్వం బోధపడలేదు. సొంత పార్టీ వాళ్లే తనపై కుట్రపన్నారని భోరు మన్నాడు. ఇక వైసీపీ అంతు చూడడమే తన లక్ష్యమంటూ జనసేన వైపుకు అడుగులు వేశారు.
ఏళ్ల తరబడి వేచి చూసేలా చేసినా చివరికి జనసేనాని ఎట్టకేలకు పృధ్విని పార్టీలో చేర్చుకున్నారు. ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైన తరుణంలో పవన్ కల్యాణ్ పృధ్వికి పార్టీ కండువా కప్పి జనసేనలో చేర్చుకున్నారు. ఆయనతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా జనసేనలో చేరారు. బుధవారం (జనవరి 23) మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జానీ మాస్టర్, పృథ్విరాజ్‌లు జనసేనలో చేరారు. ఇప్పుడు పృధ్వి సేవలను జనసేనాని ఏ విధంగా ఉపయోగించుకుంటారో చూడాలి. సిని గ్లామర్ తో పాటు ఆయన నోటి దురుసు కూడా జనసేనకు ఉపయోగపడుతుందని పరిశీలకులు అంటున్నారు.