నిన్న కేసీఆర్.. నేడు జగన్.. ఎన్నికలకు ముందే ఓటమి దర్శనం
posted on Jan 25, 2024 8:37AM
రెండు మూడు నెలల కిందటి వరకూ వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఇప్పుడు ఓటమి గ్యారంటీ అంటూ చేతులెత్తేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తన పార్టీ ఓటమిని ఆయన ఇప్పుడే చూసేశారు. ఆ విషయాన్నే క్లియర్ కట్ గా చెప్పేశారు. అదే సమయంలో తాను మళ్లీ అధికారంలోకి రాకపోతే ఏపీ పరిస్థితి అధోగతేనని ప్రజలను హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇలాగే ప్రజలను హెచ్చరించారు. తాను మరో సారి అధికారంలోకి రాకపోతే రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఉండదన్నారు. రైతు బంధు ఆగిపోతుందన్నారు. రైతులకు ఉచిత కరెంటు అందదన్నారు. తనను గెలిపించకపోతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఆనవాలు కనిపించదని హెచ్చరించారు. ఆ ఎన్నికలలో ప్రజలు హెచ్చరికలను, బెదరింపులను పట్టించుకోలేదు. ఫలితం బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు.
ఇప్పుడు ఏపీలో జగన్ కూడా అదే విధంగా తన ఓటమి ఖాయం అని ఖరారు చేసుకున్న తరువాత బెదరింపులకు దిగుతున్నారు. ప్రజలను ఎమోషనల్గా బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్ని స్తున్నారు. తాను క్రమం తప్పకుండా బటన్లు నొక్కి జనాలకు సొమ్ములు పంచుతున్నాననీ, తాను మరో సారి అధికారంలోకి రాకపోతే ప్రజలకు ఆ సొమ్ములు అందవని హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే గత నాలుగున్నరేళ్లుగా సంక్షేమం మాటను జరిగిన దోపిడీని జనం గుర్తించారు. ఆ విషయం జగన్ కు కూడా అర్ధమైంది. దీంతో ఆయన ఇక సెంటిమెంట్ ను రగిలించి.. మీ బిడ్డను, మీ కోసం కుటుంబానికి దూరం అయ్యాను అంటూ దీనాలాపనలకు దిగారు. సొంత చెల్లిని కూడా ప్రతిపక్ష నేతకు స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరిస్తోందంటూ నిందించారు.
ఇక ఇప్పుడు తాజాగా.. తిరుపతిలో ఇండియా టుడే నిర్వహించిన ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న సీఎం జగన్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఏపీలో కాంగ్రెస్ డర్టీ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. జకీయ లబ్ధి కోసం పదేళ్లనాడు రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ ఇప్పుడు అదే రాజకీయ లబ్ధి కోసం తన కుటుంబాన్ని చీల్చిందన్నారు. అంతే కాదు.. వైనాట్ 175 ధీమా ఇప్పుడు తనలో ఇసుమంతైనా లేదని చెప్పకనే చెప్పేశారు. వచ్చే ఎన్నికలలో తాను పారజయం పాలై పదవి నుంచి దిగిపోయినా బాధపడనని పరోక్షంగా తాను గద్దె దిగిపోవడం ఖాయమైపోయిందని వెల్లడించేశారు. పదవి పోయినా కోట్లాది మంది జీవితాలలో వెలుగు నింపానన్న సంతోషంతో ఉంటానని జగన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇప్పుడు ఒక సారి తెలంగాణ ఎన్నికలకు ముందు కేసీఆర్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటే ఆయన కూడా తాను ఓడిపోయినా ఫాం హౌస్ లో సంతోషంగా గడిపేస్తాననీ, అయితే తనను ఓడించినందుకు ప్రజలే బాధపడతారని అర్ధం వచ్చేలా మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించానన్నారు. అందుకోసం సావు నోట్లో తలపెట్టి వచ్చానని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డారు. గతానికి భిన్నంగా కేసీఆర్ అలా మాట్లాడడానికి కారణం ఆయన తన ఓటమిని ముందే గుర్తించేయడం వల్లనేనని తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత తెలిసింది. అయితే ఇప్పుడు జగన్ అదే బాటలో తాను ఓడిపోయినా సంతోషంగానే ఉంటాననీ, అయితే ఆ సంతోషం ప్రజలలో ఉండదనీ చెప్పడంతో జగన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియడానికి ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చే వరకూ ఆగాల్సిన అవసరం లేదని, కేసీఆర్ అనుభవాన్ని బట్టి జగన్ కు వచ్చే ఎన్నికలలో ఎదురయ్యేది పరాజయం, పరాభవమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.