చంద్రబాబు హస్తిన పర్యటన చుట్టూనే చర్చ.. ఏపీ పొలిటికల్ సీన్ మారుతోందా?

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు హస్తిన పర్యటనకు వెళ్లినా అది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అధికారంలో ఉన్నప్పూడూ, విపక్ష నేతగానూ ఆయన హస్తిన పర్యటనలకు ఎనలేని రాజకీయ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పడు తాజాగా సోమవారం (డిసెంబర్5) ఆయన హస్తిన పర్యటనకు కూడా ఎనలేని ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన పట్ల సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది.

దాదాపు నాలుగు నెలల అనంతరం ఆయన హస్తిన వెళుతున్నారు. అదీ కేంద్రం ఆహ్వానం మేరకు. నాలుగు నెలల కిందట కూడా ఆయన కేంద్రం ఆహ్వానం మేరకే హస్తినలో పర్యటించారు. అప్పుడు ఆయన పర్యటన రాష్ట్ర రాజకీయాలలో కొత్త సమీకరణాలకు తెరలేపింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కమిటీ సమావేశానికి చంద్రబాబు కేంద్రం ఆహ్వానంపై వెళ్లిన సంగతి విదితమే. అప్పడు ఆ సమావేశంలో ప్రధాని మోడీ స్వయంగా తానే చంద్రబాబు వద్దకు వచ్చి పలకరించి ఒకింత పక్కకు తీసుకువెళ్లి ఓ ఐదు నిముషాలు ప్రత్యేకంగా ముచ్చటించిన సంగతీ తెలిసిందే.  మోడీ, చంద్రబాబు మధ్య జరిగిన ఆ చిరు భేటీయే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కాళ్ల కింద భూమిని కదిల్చేసిందా అన్నంతగా రాజకీయ ప్రకంపనలు సృష్టించేసింది. వైసీపీ అయితే ఏకంగా బీజేపీ, తెలుగుదేశంల మధ్య పొత్తు పొడిచేసిందని నిర్ణయానికి వచ్చేసింది.

 ప్రభుత్వ సలహాదారు సజ్జల అయితే ఏకంగా మీడియా సమావేశం పెట్టి మరీ వచ్చే ఎన్నికలలో బీజేపీ- తెలుగుదేశం పొత్తు కుదిర్చేసుకున్నాయని, అయినా సరే గెలుపు మాదేనని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ హస్తిన పర్యటనకు వెళుతున్నారు. ఈ సారి కూడా కేంద్రం ఆహ్వానంపైనే..నాలుగు నెలల కిందట  ఆజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమం ముగింపు వేళ ఏం చేయాలి అన్న దాని మీద ప్రధాని మోడీతో జరిగిన అఖిల పక్ష భేటీలో పాలుపంచుకున్నారు.  ఇపుడు మరోసారి   జీ 20 సదస్సుల నిర్వహణపై మోడీ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్నారు.

ఈ సమావేశానికి అన్ని పార్టీల అధ్యక్షులను కేంద్రం ఆహ్వానించింది. అయినా చంద్రబాబుకు ఆహ్వానంపైనే రాజకీయవర్గాలలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ సారి బాబు పర్యటనతో ఏపీ రాజకీయాలలో పెను మార్పులు ఖాయమన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. చంద్రబాబు విజన్ ఏపీకే కాదు దేశానికీ అవసరమన్న అభిప్రాయంతోనే గతంలో అంటే తెలుగుదేశం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న సమయంలో ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి మరీ  ఇటీవలి కాలంలో వరుసగా   ఆహ్వానాలు పలుకుతోందన్న చర్చ జరుగుతోంది.   చంద్రబాబు కూడా ఈ సానుకూలతను ఒక అవకాశంగానే భావిస్తున్నరనీ అంటున్నారు. ఏపీలో ముందస్తు సంగతి పక్కన పెట్టినా మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరుగుతాయి.  జగన్ మూడున్నరేళ్ల పాలనపై రాష్ట్రంలో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. రానున్న రోజులలో ఈ ప్రజావ్యతిరేకత మరింత పెరుగుతుందన్న అంచనాలున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

నలుగు నెలల కిందట చంద్రబాబు హస్తిన వెళ్లినప్పుడు ప్రధాని మోడీ బాబుతో మాట కలిపారు. అంతే కాదు.. మరో సారి కలుద్దాం అని కూడా అన్నారు. ఆ మరో సారి కలయిన సోమవారం (డిసెంబర్ 5)నే అన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. జీ20 సదస్సు ఏర్పాట్లపై జరగనున్న సమావేశమే అయినా చర్చ మొత్తం చంద్రబాబు హస్తిన పర్యటన చుట్టూనే తిరుగుతుండటమే..  ఏపీ రాజకీయాల్లో ఇప్పటికే మారిన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. అది పెను సంచలనం అవుతుంది అని అంటున్నారు.