క్షమించడం ఎంత పవర్ ఫుల్ గా పని చేస్తుందో తెలుసా?

 

జీవితంలో తప్పొప్పులు జరుగుతూ ఉంటాయి.  మనల్ని కొందరు బాధపెడతారు.  మనం కొందరి వల్ల బాధపడుతూ ఉంటాము. మనల్ని బాధపెట్టిన వాళ్ల మీద కోపం రావడం చాలా సహజం.  అలాగే మనం బాధపెట్టిన ఎదుటివారికి కూడా మన మీద అంతే కోపం వస్తుంది.  పలు సందర్భాలలో ఇలాంటి కోపాలు, ఎదుటి వారి నుండి ఇబ్బంది,  ఎదుటి వారి వల్ల సమస్యలు ఎదుర్కుంటూనే ఉంటాం. అయితే మనల్ని ఎవరు బాధపెట్టినా వాళ్లను ఏమీ అనకుండా కేవలం క్షమించేసి మన పని మనం చేసుకోవడం చాలా పవర్ ఫుల్ ఆయదం లాంటిదని అంటారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  క్షమా గుణం అంత గొప్పది,  అంత శక్తివంతమైనది ఎలా అయ్యింది? దీని గురించి తెలుసుకుంటే..

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కారణంగా తప్పులు చేస్తుంటారు. అయితే ఎదుటివారు చేసే తప్పులను పట్టుకుని ఉండటం వల్ల మనకే హాని కలుగుతుందని అంటున్నారు. అందుకే వాళ్ల తప్పులను పట్టుకోవడానికి బదులుగా వారిని క్షమించడం మంచిదని అంటున్నారు.

ఎదుటి వారి తప్పుల్ని పట్టుకోవడం అంటే కచ్చితంగా కోపంతో ఉండటం.  ఇలా కోపంతో, ఆగ్రహంతో ఉండటం వల్ల మనిషి మానసిక భారం పెరుగుతుంది. అదే అవతలి వ్యక్తిని క్షమించి ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తే మానసిక భారం తగ్గుతుందట.

క్షమించడం వల్ల మనసుకు ప్రశాంతత, ఓదార్పు లభిస్తాయి.  ఇతరులను  క్షమించడం,  కోపాన్ని వదిలేయం వల్ల నెగిటివ్ ఆలోచనల నుండి విముక్తి పొందుతారు. ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటారో అప్పటి నుండి మనలో తప్పు ఆలోచనలు, చెడు స్వభావం అన్నీ మాయమవుతాయి.

కష్టాలు మనిషికి కాక,  మానుకు వస్తాయా? అనే మాట తరచుగా వింటూనే ఉంటాం.  అలాగే కోపం కూడా అంతే.. మనిషికే కోపం అధికం. అలాగే దాన్ని బయటపెట్టడం కూడా అధికం.  ఇక్కడ విషయమేమిటంటే.. మనిషికి విచక్షణ జ్ఞానం ఉంటుంది.  అదుపు చేసుకునే స్వభావం ఉంటుంది.  కాబట్టి కోపాన్ని వదిలేయాలి. ఇలా చేస్తే..ముఖ్యంగా మానవ సంబంధాలు చాలా మెరుగుపడతాయి. ఒక్క  క్షమాపణ తెగిపోయే బంధాలను కూడా నిలబెడుతుంది.

క్షమాపణను ఆధ్యాత్మిక కోణంలో కూడా పరిశీలించవచ్చు. ఏ మతమైనా, ఏ చెప్పిన విధానాలు అయినా పరిశీలిస్తే.. క్షమాపణ అనేది చాలా గొప్ప ధర్మం అని అర్థమవుతుంది. క్షమాపణ మనిషికి గొప్ప వ్యక్తిత్వం గల వాడిగా మార్చుతుంది.

క్షమించడం వల్ల మనిషిలో ద్వేషం, అసూయ వంటివి మాయమవుతాయి.  వాటి స్థానంలో కరుణ, ప్రేమ చేరతాయి.  ఈ మంచి గుణాలు మనిషిని జీవితాంతం మరింత అందంగా,  ఆరోగ్యంగా ఉంచుతాయి.

                                *రూపశ్రీ.